Reading Time: 2 minutes
గుమ్మడి గింజలు vs సన్‌ఫ్లవర్ గింజలు.. ఆరోగ్యానికి ఏవి బెస్ట్..? అసలు తేడా ఏంటో తెలుసుకోండి..

నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో కీలకం. అందుకే చాలామంది తమ రోజువారీ డైట్‌లో సూపర్‌ఫుడ్స్‌గా పేరుగాంచిన రకరకాల గింజలను భాగం చేసుకుంటున్నారు. వీటిలో గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ప్రముఖంగా వినిపిస్తాయి. రెండూ శరీరానికి మేలు చేసే పోషకాలతో నిండినవే అయినప్పటికీ.. వీటిలో వేటి ప్రయోజనాలు ఎలాంటివి? ఏ సమస్య ఉన్నవారు వేటిని ఎంచుకోవాలి? అనే విషయంలో చాలా మందికి రకరకాల డౌట్లు ఉంటాయి.

పోషకాల లెక్కలివే

పొద్దుతిరుగుడు గింజలు: సుమారు 28 గ్రాములు గింజల్లో 250 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు విటమిన్-ఇ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

గుమ్మడికాయ గింజలు: సుమారు 28 గ్రాములు గింజల్లో 160 కేలరీలు, 8 గ్రాముల ప్రొటీన్, 1 గ్రాము ఫైబర్ ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండి ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్, అమైనో ఆమ్లాలు అత్యధిక మోతాదులో లభిస్తాయి.

పొద్దుతిరుగుడు గింజల ప్రత్యేకతలు

గుండెకు పదిలం: ఇందులో ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, కరగని పీచుపదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్-ఇ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ గుండెను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

యవ్వన కాంతికి రక్షణ: ఇందులోని విటమిన్-ఇ, సెలీనియం అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి. ముడతలను నివారించి, కణజాలాల పునరుత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

ఆకలి నియంత్రణ: ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. ఇది అతిగా తినడాన్ని నివారించి, బరువును అదుపులో ఉంచుతుంది.

గుమ్మడికాయ గింజల అద్భుత ప్రయోజనాలు

ఎముకల పటిష్టత – రోగనిరోధక శక్తి: గుమ్మడి గింజల్లో లభించే జింక్ ఎముకల సాంద్రతను పెంచి ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. విటమిన్-ఇ, జింక్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

పురుషుల ఆరోగ్యానికి మేలు: వీటిలో ఉండే ఫైటోస్టెరాల్స్ ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఒత్తిడి, విచారం మాయం: గుమ్మడి గింజల్లో సెరోటోనిన్ స్థాయిలను పెంచే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మానసిక ఆందోళన, విచారాన్ని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.

బరువు నియంత్రణ: కేలరీలు తక్కువగా ఉండి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, అధిక ప్రొటీన్ ఉండటం వల్ల ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి సరైన ఎంపిక.

ఈ రెండింటిలో ఏది బెస్ట్?

గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం పొద్దుతిరుగుడు గింజలు మేలు చేస్తే.. అధిక ప్రొటీన్, ఎముకల బలం, ఒత్తిడి నివారణ, బరువు తగ్గడం కోసం గుమ్మడి గింజలు అద్భుతంగా తోడ్పడతాయి. రెండింటిలోనూ అద్భుత పోషకాలు ఉన్నందున.. మీ శరీర అవసరాలకు తగినట్లుగా వీటిని సమతుల్యంగా ఆహారంలో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.