
అనర్హతపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది.
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేశారు. ఈ నిర్ణయమే ఆయన ఎమ్మెల్యే పదవికి ముప్పు తెచ్చిపెట్టింది. అప్పుడు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయి, ఇప్పుడు శాసన సభ్యత్వాన్ని కోల్పోయి.. దానం నాగేందర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్‌లోని 2(1)(ఎ) ప్రకారం.. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని హైకోర్టు ప్రకటించింది. అదే తేదీన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫారం తీసుకుని సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు నామినేషన్ వేశారని, బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్టు దానం నాగేందర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఎన్నికలు నాకు కొత్త కాదు.. నేను ఫైటర్ను.. మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా..’ అని ధీమా వ్యక్తం చేశారు.
అయితే.. ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను దానం ఆశ్రయించడం గమనార్హం. దానం తరపున ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు దానంపై అనర్హత వేటును సమర్థించింది.