
యాదగిరిగుట్ట, వెలుగు: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంపవర్‌మెంట్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలను ప్రస్తావించగా, పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని తెలిపారు.
ఇందులో భాగంగా అట్రాసిటీ బాధితులకు రూ.32 కోట్ల పరిహారంతో పాటు, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు రూ.829 కోట్లు, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు రూ.134 కోట్లు, ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ నిధులు రూ.102 కోట్లు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు రూ.56.20 కోట్లు వంటి బకాయిలను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.900 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.1,650 కోట్ల రాయితీ నిధులకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అట్రాసిటీ బాధితులకు ఇప్పటికే రెండు వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించామని, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అదనపు, మొబైల్ కోర్టుల ఏర్పాటును ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.