Reading Time: 2 minutes
సింపుల్ పోషకాల పచ్చడి.. కానీ ఒక్క స్పూన్ తింటే అలసట, నీరసం ఉండదు..

పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి.. విటమిన్ ఎ, సి, బి-కాంప్లెక్స్ తోపాటు ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే పుదీనా తినాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు.. పుదీనా జీర్ణక్రియ మెరుగుపర్చి.. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. పుదీనాలోని మెంథాల్ జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది.. పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి, బ్యాక్టీరియా నశిస్తుంది. దీని సువాసన మెదడును ప్రశాంతపరుస్తుంది, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. అందుకే పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆహార, వైద్య నిపుణులు.. అలాంటి ఆహారాల్లో పుదీనా పచ్చడి ఒకటి..

పుదీనా పచ్చడి భారతీయ వంటకాల్లో ఒక ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంది. దీని అద్భుతమైన రుచి, సువాసన ఏ ఆహారాన్నైనా ప్రత్యేకంగా మారుస్తుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని పుదీనా పచ్చడితో కలిపి తింటే ఆ రుచి మర్చిపోలేనిది. అన్నంలోకే కాకుండా, ఇడ్లీ, దోశ, వడ వంటి బ్రేక్‌ఫాస్ట్‌లకు ఇది చక్కటి అనుబంధంగా ఉపయోగపడుతుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో సుమారు 4-5 రోజుల పాటు తాజాగా నిల్వ ఉంచుకోవచ్చు, ఇది మీకు సమయాన్ని ఆదా చేస్తుంది. ఇంట్లో ఈ రుచికరమైన పుదీనా పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

  • పుదీనా ఆకు – 1 కట్ట లేదా 2 కట్టలు.. (శుభ్రం చేసి కట్ చేసినవి)
  • పచ్చిశెనగపప్పు – 1 టీ స్పూన్
  • మినప్పప్పు – 1 టీ స్పూన్
  • ధనియాలు – 1 టీ స్పూన్
  • జీలకర్ర – ½ టీ స్పూన్
  • నువ్వులు – 1 టీ స్పూన్ (లేదా వేరుశనగ గుళ్ళు)
  • నూనె – 1.5 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి – 8-10 (కారం తగ్గట్టుగా)
  • కొత్తిమీర – ½ కప్పు (ఐచ్ఛికం)
  • టమాటాలు – 3 మధ్యస్థాయివి లేదా 4 చిన్నవి (పెద్ద ముక్కలుగా కట్ చేసినవి)
  • వెల్లుల్లి రెబ్బలు – 2
  • చింతపండు – కొద్దిగా
  • ఉప్పు – రుచికి సరిపడా
  • బెల్లం – కొద్దిగా (ఐచ్ఛికం)

తయారీ విధానం:

మసాలా పొడి తయారీ:

మొదటగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని, అందులో పచ్చిశెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి దోరగా వేయించుకోవాలి. ఇవి లేత బంగారు రంగులోకి మారిన తర్వాత, నువ్వులు వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించి, వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. నువ్వులకు బదులుగా కొద్దిగా వేరుశనగ గుళ్ళను కూడా ఉపయోగించవచ్చు. ఈ వేయించిన దినుసులను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, వాటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని, సన్నని పొడిలా గ్రైండ్ చేసి, ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

పుదీనా మిశ్రమం తయారీ:

ఇప్పుడు అదే కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎనిమిది నుండి పది (మీ కారానికి తగినట్లుగా) పచ్చిమిరపకాయలను వేసి వేయించాలి (పచ్చడికి పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది). పచ్చిమిర్చి వేగిన తర్వాత, శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకును, అర కప్పు కొత్తిమీరను (కొత్తిమీర ఆప్షనల్, కానీ వేస్తే రుచి చాలా బాగుంటుంది) వేసి బాగా కలపాలి. ఆ తర్వాత, పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న టమాటాలు అయితే నాలుగు, మధ్యస్థాయివి అయితే మూడు వేసుకోవాలి. ఈ టమాటాలను ఒకసారి కలిపి, మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్‌లో ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. టమాటాలు సాఫ్ట్‌గా మగ్గిపోయిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

రుబ్బడం:

పూర్తిగా చల్లారిన పుదీనా మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నచ్చితే, ఈ సమయంలో కొద్దిగా బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా తయారుచేసి పెట్టుకున్న పప్పుల పొడిని ఇందులోకి యాడ్ చేసి, అన్నీ బాగా కలిసేలా ఒక్కసారి పల్స్ చేయాలి.

ఇలా తయారైన పుదీనా పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకుని, తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడి వేడి అన్నంలోకి, బ్రేక్‌ఫాస్ట్‌లలోకి చక్కటి కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం.. కమ్మనైన పుదీనా పచ్చడిని మీ ఇంట్లో తయారుచేసి, మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..