
AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుంది తీవ్ర వాయుగుండం.. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కళింగపట్నానికి సుమారు 30 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 90 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 160 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది.
కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం
తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 12 గంటల మధ్య ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య ప్రాంతంలో దీని ప్రభావం ఉండనుంది. ఆర్టీజీఎస్ అవేర్–విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తీవ్ర వాయుగుండం కదలికలు, వాతావరణ పరిస్థితులపై క్షేత్రస్థాయి అధికారులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి
తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు మరో 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నందున ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
9 ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
అత్యవసర సహాయక చర్యల కోసం ఉత్తరాంధ్ర, పరిసర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళంలో 3, అల్లూరి జిల్లాలో 2, విశాఖపట్నంలో 2, పోలవరంలో 1, అనకాపల్లిలో 1 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. మొత్తం 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
వదంతులను నమ్మొద్దు
వాయుగుండం పరిస్థితులపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. అధికారికంగా అందించే సమాచారం ఆధారంగానే ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర సమాచారం, సహాయక చర్యల కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 4250101 అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఇక, బుధవారం సాయంత్రం 7 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో 88.2 మిల్లీమీటర్లు, లక్ష్మీనర్సుపేటలో 73.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.