
గ్రామీణ, చిన్న పట్టణాల పరిధిలోని వ్యాపారులకు గ్యాస్ ఏజెన్సీలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఏజెన్సీలు రూ.200 నుండి రూ.600 వరకు తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నాయి. ఈ ఆఫర్ చమురు సంస్థలు ఇచ్చింది కాదని, స్థానిక ఏజెన్సీలే స్వయంగా ఇస్తున్నాయని సమాచారం. అయితే ఈ ధరల తగ్గింపునకు అసలు కారణం ఏంటి? సాధారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల్లో వాడే 19 కేజీల సిలిండర్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది చిన్న వ్యాపారులు గృహ వినియోగ సిలిండర్లనే వాడుతుంటారు. దీనివల్ల ఏజెన్సీల వద్ద వాణిజ్య సిలిండర్ల నిల్వలు పెరిగిపోతున్నాయి. మరోవైపు కంపెనీల నిబంధనల ప్రకారం.. కొత్త గ్యాస్ లోడ్‌తో వచ్చే వాహనాలు తిరిగి వెళ్లేటప్పుడు అంతే సంఖ్యలో ఖాళీ సిలిండర్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ స్టాక్ సర్క్యులేషన్ ఆగకుండా ఉండటానికి, డిమాండ్ లేక పేరుకుపోయిన వాణిజ్య సిలిండర్లను ఖాళీ చేయడం కోసం ఏజెన్సీ నిర్వాహకులు MRP కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ కుషినగర్‌లో రూ.2,946 ఉన్న వాణిజ్య సిలిండర్‌ను రూ.2,400 నుంచే అందిస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థ మెరుగుపడటంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రెండోసారి బుక్ చేసుకోవడానికి 45 రోజుల నిరీక్షణ సమయం ఉండేది. దానిని ఇప్పుడు పట్టణాలతో సమానంగా 25 రోజులకు కుదించారు. చమురు కంపెనీలు ఈ సవరించిన నిబంధనను తక్షణమే అమలులోకి తీసుకువచ్చాయి. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అధికారిక రికార్డుల ప్రకారం ఢిల్లీలో గృహ సిలిండర్ ధర రూ.942గా, వాణిజ్య సిలిండర్ అధికారిక ధర రూ.2,747.50గా స్థిరంగా కొనసాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: