
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటుచేసుకున్న ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు.
ఐదుగురు బాధితులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 150 పడకల సామర్థ్యంతో మాతా శిశు ఆసుపత్రిని యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసుపత్రిని త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.
బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు, ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఆదిలాబాద్ రిమ్స్ లో సెప్టెంబర్ 21సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. వార్డులో దట్టంగా పొగ కమ్ముకుని పిల్లలు అస్వస్థతకు గురవ్వగా వెంటనే వారిని మరో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రిము చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు శిశువులు మరణించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.