
హైదరాబాద్: అసెంబ్లీ గేటు దగ్గర ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు సభా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్ అధికారాలే కీలకమని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకునే విషయంలోనూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాసనసభ కార్యకలాపాలకు సంబంధించి ఎమ్మెల్యేల హక్కులను పోలీసులు అడ్డుకోకూడదని సూచించింది.ఇదే సమయంలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన పోలీసుల దాడి ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.
ఘటనకు పాల్పడిన పోలీసులను గుర్తించాలని ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించిన కోర్టు.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.