
హైదరాబాద్: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని అన్నారు. రాహుల్ గాంధీ తరహాలోనే తాము కూడా నిరసన తెలిపామని, ఎలాంటి అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించలేదని స్పష్టం చేశారు.స్పీకర్ ను ఉద్దేశించి తాతా మధు ఎలాంటి అసభ్య పదజాలం మాట్లాడలేదన్నారు కేటీఆర్.
పోలీసుల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసనలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తాము ఏ నిబంధన ప్రకారం అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని అన్నారు.
రాహుల్ గాంధీకి ఒక రూల్, మాకు ఒక రూల్ ఉంటుందా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే నిబంధనలు ఉండాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన హామీలు.. 1000 రోజులు గడిచినా అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామని, తమకు కేటాయించిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పకుండా మాట్లాడతారని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దారుణంగా అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు సభలో వివక్ష చూపడం సరికాదన్నారు.ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వనని స్పీకర్ చెప్పడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. సభలో తమకు ఉన్న సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోకపోయి ఉంటే అసెంబ్లీ కార్యకలాపాలు సాఫీగా జరిగేవని అన్నారు.తమపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో రాహుల్ గాంధీ పుట్టుకపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ మొదట ఖండించిన విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు.