Reading Time: < 1 minute

గ్యాస్ సిలిండర్ యూజర్లకు గుడ్‌న్యూస్: బుక్కింగ్ గడువుపై పట్టణాలు, గ్రామాల్లో ఇక ఒకే రూల్!

Caption of Image.

డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో LPG గ్యాస్ సరఫరా మెరుగవ్వడం, డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసం తగ్గిపోవడంతో బుకింగ్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది కేంద్రం. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ బుకింగ్ గ్యాప్‌ను 45 రోజుల నుంచి ఏకంగా 25 రోజులకు తగ్గించేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ యూజర్లు మారిన కొత్త నిబంధన ఒకేలా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై దేశంలోని ఏ వినియోగదారుడైనా.. పట్టణం నుంచి బుక్ చేసినా లేదా గ్రామం నుంచి బుక్ చేసినాసరే 25 రోజులకు ఒకసారి ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఘర్షణలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై పడిన ప్రభావం కారణంగా ప్రభుత్వం గతంలో కొన్ని తాత్కాలిక డిమాండ్-మేనేజ్‌మెంట్ చర్యలను చేపట్టింది. వినియోగదారులు అదనపు సిలిండర్లను నిల్వ చేయకుండా ఆపడానికి.. అందరికీ సమానంగా గ్యాస్ అందేలా చూడటానికి పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల బుకింగ్ నిబంధనను అమల్లోకి తెచ్చింది అప్పట్లో. కానీ ప్రస్తుతం  పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవటంతో నిబంధనలను మార్చింది మోడీ సర్కార్.

పండుగల సీజన్ ప్రారంభానికి ముందు పరిస్థితులు పూర్తిగా మెరుగవడంతో.. గ్రామీణ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆంక్షలను సడలించారు. దీంతో గ్రామాల్లోని గృహిణులకు ఎంతో ఊరట లభించనుంది. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో గ్యాస్ అయిపోయినప్పుడు రీఫిల్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదన్నమాట. 

©️ VIL Media Pvt Ltd.