Reading Time: 2 minutes
Shefali Verma: పాక్‌పై 12 పరుగులే చేసినా.. ఏకంగా రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ

Shefali Verma: మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది. ఈ చిన్నపాటి ఇన్నింగ్స్‌తోనే ఆమె ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాసింది. ఏకంగా రెండు ఆల్ టైమ్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో ఇన్నింగ్స్ ఆరంభంలో 7 పరుగులు దాటగానే షెఫాలీ వర్మ అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్‌లో 3000 పరుగుల అరుదైన మైలురాయిని చేరుకుంది. కేవలం 22 సంవత్సరాల 220 రోజుల వయసులోనే ఈ మార్కును దాటి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. గతంలో ఐర్లాండ్‌కు చెందిన గాబీ లూయిస్ 24 సంవత్సరాల 247 రోజుల వయసులో నమోదు చేసిన రికార్డును షెఫాలీ తుడిచిపెట్టేసింది. ఈ జాబితాలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (27 ఏళ్ల 171 రోజులు) తదుపరి స్థానాల్లో ఉంది.

మెన్స్ క్రికెట్‌లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డు

షెఫాలీ సాధించిన ఈ ఘనత కేవలం మహిళల క్రికెట్‌కే పరిమితం కాలేదు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఏ ఒక్క ఆటగాడు ఇంత చిన్న వయసులో 3000 పరుగులు మైలురాయిని అందుకోలేకపోయారు. మెన్స్ క్రికెట్‌లో మలేషియాకు చెందిన వీరన్‌దీప్ సింగ్ 26 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించగా, ఫుల్ మెంబర్ దేశాల విభాగంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ 28 ఏళ్ల వయసులో ఈ మార్కును దాటాడు. వారందరికంటే ఎంతో చిన్న వయసులోనే షెఫాలీ ఈ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.

అత్యంత వేగంగా బంతుల రూపంలో మైలురాయి

కేవలం వయసు పరంగానే కాకుండా, ఎదుర్కొన్న బంతుల లెక్కన చూసినా షెఫాలీ వర్మ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టి20ల్లో కేవలం 2321 బంతుల్లోనే 3000 పరుగులు పూర్తి చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారిణి అలిస్సా హేలీ పేరిట ఉన్న రికార్డును ఆమె అధిగమించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసే షెఫాలీ, బంతిని బాదే తీరులోనే ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది.

మంధాన, హర్మన్‌ప్రీత్‌లను వెనక్కి నెట్టిన షెఫాలీ

భారత మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తర్వాత 3000 టి20 పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్‌గా షెఫాలీ అవతరించింది. ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే వీరిద్దరి కంటే ఎంతో వేగంగా ఈ ఘనత సాధించింది. షెఫాలీ కేవలం 113 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోగా, మంధాన 122 ఇన్నింగ్స్‌లు, హర్మన్‌ప్రీత్ 135 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. ఇక ఓవరాల్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (100 ఇన్నింగ్స్‌లు) ఈ రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ అగ్రస్థానంలో ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..