Reading Time: 2 minutes
Balochistan Attack Bla Claims 25 Pakistani Soldiers Killed Releases Cinematic Video

BLA Attack: పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) చుక్కలు చూపిస్తోంది. రెండు వేర్వేరు దాడుల్లో 25 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు చెప్పింది. బీఎల్ఏ దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. బలూచిస్తాన్‌లో డ్యూటీ అంటేనే వెళ్లేందుకు పాక్ సైనికులు భయపడుతున్నారు. వీలైతే సెలవు, కాదంటే రిజైన్ చేస్తున్నారు. తాజా దాడికి సంబంధించి బీఎల్ఏ ఒక వీడియోను రిలీజ్ చేసింది. పాకిస్తాన్ సైనికుల ట్రక్కును సినిమా తరహాలో దాడి చేసింది. జియారత్ క్రాస్ వద్ద తమ ‘ఫతే స్క్వాడ్’ యోధులు సైనిక కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసి రెండు వాహనాలను ధ్వంసం చేశారని శుక్రవారం బీఎల్‌ఏ ప్రకటించింది. ఈ దాడిలో 18 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని బీఎల్‌ఏ పేర్కొంది. మరో ఐదుగురు పాకిస్తానీ సైనికులు తప్పించుకునే క్రమంలో గాయపడ్డారని తెలిపింది.

బీఎల్ఏ అధికారిక మీడియా హక్కల్ మంటల్లో కాలిపోతున్న పాక్ సైనిక వాహనాన్ని చూపించింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు, పాకిస్తాన్ సైన్యం మరణించిన జవాన్లను శవపేటికల్లో ఉంచి, ప్రార్థనలు చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఫతే స్వ్కాడ్ బీఎల్ఏలో స్పెషల్ పోరాట దళంగా పనిచేస్తోంది. కొండలతో కూడి ఉన్న బలూచిస్తాన్‌లో గెరిల్లా యుద్ధం, ఆకస్మిక దాడులకు పేరుపొందింది. 2025 మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది కూడా ఈ దళమే.

సురబ్‌లోని హజికాలో జరిగిన మరో దాడిలో తమ STOS యూనిట్ (స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్) రిమోట్ కంట్రోల్ వాహనాన్ని ఉపయోగించి పేలుడు జరిపిందని, ఈ దాడిలో ఏడుగురు పాకిస్తానీ సైనికులు మరణించారని BLA ప్రకటించింది. అయితే, పాక్ ఆర్మీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మృతుల సంఖ్యను చెప్పలేదు. గత కొన్ని నెలల్లో పాక్ సైన్యంపై మొత్తం 36 ఆపరేషన్లు చేపట్టి 33 మందికి పైగా సైనికుల్ని హతమార్చినట్లు బీఎల్ఏ చెప్పింది.

ఇదిలా ఉంటే, బీఎల్ఏపై ప్రతీకారం తీర్చుకున్నట్లు పాక్ సైన్యం చెప్పింది. గత 72 గంటల్లో బలూచిస్తాన్‌లోని మస్తుంగ్, సిబి, క్వెట్టా, కలాత్ జిల్లాలో మిలిటెంట్ల స్థావరాలపై జరిపిన దాడుల్లో 48 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు చెప్పింది. హతమైన వారిలో నిషేధిత బీఎల్ఏ, తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ)కి చెందిన వారు ఉన్నారని ప్రకటించింది.