Reading Time: 2 minutes
పిడుగు మీద పడ్డా ప్రాణాలతో వ్యక్తి.. డోర్ బెల్ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!

న్యూయార్క్‌లోని స్టేటెన్ ఐలాండ్‌లో ఉండే థామస్ ఫామీ దంతాల చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లాలని ఉదయమే ఇంటి నుంచి బయటపడ్డారు. అప్పటికే బయట వర్షం కురుస్తుండటంతో, చేతిలో గొడుగు పట్టుకుని ఇంటి ఆవరణ దాటి వీధిలోకి అడుగుపెట్టారు. అంతలో హఠాత్తుగా భారీ పిడుగు అతనికి అత్యంత సమీపంలోనే పడింది. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లగా ఆ పిడుగుపాటు తీవ్రతకు థామస్ అక్కడికక్కడే షాక్‌తో  కుప్పకూలిపోయారు.

 పిడుగుపాటు తీవ్రతకు క్షణంలో కుప్పకూలిపోయిన థామస్, కొద్దిసేపటికే తేరుకుని కళ్లు తెరిచారు. కేవలం కొన్ని సెకన్లలోనే షాక్ నుంచి బయటపడి మెల్లగా పైకి లేచి నిలబడ్డారు. సహాయం కోసం కేకలు వేసారు. పక్కింటి వారు స్పందించి థామస్‌ను స్టేటెన్ ఐలాండ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ రాత్రంతా వైద్యుల పర్యవేక్షణలో ఉండి మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. వైద్య పరీక్షల్లో అతనికి  కాలిన గాయాలు కానీ, పాదాల ఎముక విరగడం కానీ  జరగలేదనీ తేలింది.

ఆ భయానక ఘటన అతని ఇంటి బయట డోర్‌బెల్ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు అని నెటిజన్లు షాక్ అవుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఇంకా భూమ్మీద నూకలు ఉండటం వల్లే ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత పెద్ద పిడుగుపాటు నుంచి ఎవరైనా బతకడం అద్భుతమనే చెప్పాలి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు.

థామస్ ఫామీ స్పందిస్తూ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ” ఆ సమయంలో నా శరీరంలో విద్యుత్ షాక్ వ్యాపించినట్లు అనిపించింది. ఆ తర్వాత ఒళ్లంతా తిమ్మిరెక్కడం, విపరీతమైన నొప్పితో పాటు మంట పుట్టింది” అన్నారు. “అది నిజంగా చాలా తీవ్రమైన మంట.. ఒళ్లంతా జలదరింపు, తిమ్మిరి, భరించలేని నొప్పితో బాధపడ్డాను. ముఖ్యంగా పాదాలలో తీవ్రమైన నొప్పి కలిగింది. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలాంటి పెద్ద గాయాలు కూడా కాలేదు. ఇది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన ఈ భయానక అనుభవాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను” అని థామస్ భావోద్వేగంతో చెప్పారు.

 పిడుగు  పడి కూడా ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా క్షేమంగా బయటపడి,  మృత్యువును తృటిలో తప్పించుకున్న థామస్ ఫామీ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) లెక్కల ప్రకారం, ప్రతి ఏటా అమెరికాలో దాదాపు 37 మిలియన్ల పిడుగులు పడుతుంటాయి. అయితే పిడుగుపాటుకు గురైన వారిలో దాదాపు 90 శాతం మంది ప్రాణాలతో బయటపడుతుంటారని సంస్థ తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి