
సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్‌గా రూపొందిన తాజా చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సొంత ప్రొడక్షన్ అయిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ మీద ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమా, ప్రమోషన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాంగ్స్ వర్కౌట్ అవ్వడంతో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో, సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
రోమాంచకం కథ: హైదరాబాదులో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దానికోసం కష్టపడుతూ ఉంటాడు అన్వేష్ (సుమంత్ ప్రభాస్). అతనికి ఒక నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్లతో ఎప్పటికప్పుడు చిల్ అవుతూ ఉండే అన్వేష్, తన డేటింగ్ యాప్ ప్రిపరేషన్ కోసం మరో డేటింగ్ యాప్‌లో ఒక అమ్మాయితో మాట్లాడాలనే ఉద్దేశంతో మైథిలి (అనంతిక) అనే అమ్మాయికి కనెక్ట్ అవుతాడు. చెన్నైలో ఉండే ఆ అమ్మాయితో క్రమక్రమంగా బాండ్ పెరుగుతూ వెళ్తుంది. ఆమె పుట్టినరోజుకు ఏకంగా చెన్నై వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే, అతన్ని కలుస్తానని చెప్పి ఫోన్ బ్లాక్ చేసి ఆమె రివర్స్ సర్ప్రైజ్ ఇస్తుంది. అసలు ఆమె ఎందుకు అలా చేసిందో అర్థం కాక తలబాదుకుంటూ హైదరాబాద్ వచ్చిన అన్వేష్, చాలాకాలం పాటు ఈ డైలమాలోనే ఉండిపోతాడు. అనుకోకుండా తాను హైదరాబాద్ వస్తున్నానని ఫోన్ చేసిన మైథిలి, అన్వేష్ దగ్గరకు రావడమే కాదు, అతను సిద్ధం చేసిన ఒక ఫ్లాట్‌లో రెండు రోజులు ఉంటానని కూడా చెబుతుంది. అయితే, అన్వేష్ ఒక పని మీద బయటకు వెళ్లి వచ్చేలోపు సూసైడ్ నోట్ రాసి మిస్ అవుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? అనే విషయం తెలియక అన్వేష్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి హైదరాబాద్ అంతా వెతుకుతూ ఉంటాడు. అయితే, అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది? చెన్నై వచ్చిన అన్వేష్‌ను కలవకుండా ఫోన్ ఎందుకు బ్లాక్ చేసింది? మళ్ళీ హైదరాబాద్ వచ్చిన ఆమె అన్వేష్‌ను కలిసిన తర్వాత సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిన కారణమేంటి? అసలు మైథిలి ఇబ్బంది ఏంటి? దాన్ని అన్వేష్ క్లియర్ చేశాడా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: ‘రోమాంచకం’ అనే పేరు ఆసక్తికరంగా ఉండడంతో పాటు, సందీప్ రెడ్డి వంగా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. సినిమా మొదలైన కాసేపు సెటప్ బాగుంది. అంత రిఫ్రెషింగ్ అనిపించకపోయినా, రొటీన్ ఫీలింగ్ రాకుండా కాస్త కొత్త సెటప్ ఏదో బిల్డ్ చేస్తున్నారనే ఫీలింగ్ తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత ఫ్లో అంతా మనకు అలవాటైన లాగానే అనిపిస్తుంది. గాలికి తిరిగే హీరో స్టార్టప్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకోవడం, ఆ స్టార్టప్ ప్రిపరేషన్‌లో భాగంగానే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడటం, ఆ అమ్మాయితో క్లోజ్ అవ్వడం, ప్రేమలో పడటం అంటూ సాగిపోతుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కాస్త ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే నిడివి రెండున్నర గంటలు ఉంటే, గంటా 20 నిమిషాలు ఫస్ట్ హాఫ్‌కే వెచ్చించారు. ఇక ఫస్ట్ హాఫ్‌లో ప్రీ-ఇంటర్వెల్ కొంతవరకు వర్కౌట్ అయి, సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచింది. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక కూడా మిస్సయిన అమ్మాయి ఎందుకు మిస్సయింది అనే పాయింట్ మీద కాస్త ప్రేక్షకులలో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు, కానీ ఆ తర్వాత దానికి తగ్గ ఎస్టాబ్లిష్‌మెంట్ కుదరలేదనిపించింది. ఇప్పటికే ఇలాంటి తరహా సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి; ఈ సినిమాలో ఏదైనా కొత్త పాయింట్ డిస్కస్ చేసి ఉంటారేమో అనుకునే ప్రేక్షకులకు మాత్రం నిరాశ తప్పదు. సరదా సరదాగా సాగిపోతూనే సిట్యువేషనల్ కామెడీతో బండి నడిపించాలనే ప్రయత్నం చేశారు. అది కొంతవరకు వర్కౌట్ అయింది కానీ, కొన్నిచోట్ల వర్కౌట్ అవ్వలేదు. సిట్యువేషన్ కామెడీతో పాటు ఈ మధ్య కాలంలో కొన్ని హిట్ సినిమాలు ఫాలో అయిన ప్రెసెంట్ ట్రెండ్‌కి తగ్గ డైలాగులు కొన్నిచోట్ల పేలాయి. ఓవరాల్‌గా సినిమాలో స్టోరీ పెద్దగా లేదు కానీ, సెటప్‌తో దాన్ని కొంతవరకు నడిపించే ప్రయత్నం చేశారు. కాకపోతే సినిమా చూస్తున్నంత సేపు ఎగ్జైట్ చేసే మూమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కొన్నిచోట్ల నవ్వించారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమాలో ప్రేమ పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. హాస్యం కొంతవరకు వర్కౌట్ అయింది, ఉత్కంఠ కూడా కొంతవరకు వర్కౌట్ అయింది. ప్రేమ జానర్‌కి తగ్గట్టు రాసుకున్నారు కానీ, సినిమాల్లో అయినా సరే ఆ ప్రేమ ఎస్టాబ్లిష్‌మెంట్ లేకపోతే ఆ ప్రేమ చుట్టూ రాసుకున్న కథకు పరిపూర్ణత ఏర్పడదు. ఈ సినిమా విషయంలో వారిద్దరి మధ్య లవ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పూర్తిస్థాయిలో వర్కౌట్ అయింది అనిపించలేదు. అయితే Gen G లవ్ ఇంతేనేమో అనిపించేలా రాసుకున్నాడు డైరెక్టర్. కానీ నవ్విస్తూనే ప్రేక్షకులను తర్వాత ఏం జరగబోతోంది అనే విషయంలో ఉత్కంఠకు గురి చేసే విషయంలో కొంతవరకు టీం సక్సెస్ అయింది. దానికి తోడు సందీప్ రెడ్డి భాగం అయ్యాడు కాబట్టి ఆయన మార్క్ ఉంటుందని అనుకుని థియేటర్లకి వెళ్ళే వారికి నిరాశ తప్పదు.
నటీనటుల విషయానికి వస్తే: సుమంత్ ప్రభాస్ నటన బాగుంది. గత సినిమాలతో పోలిస్తే పరిణితి కనిపించింది. అనంతిక క్యూట్‌గా కనిపిస్తూనే కళ్ళతోనే యాక్ట్ చేసింది. ఇక ఫ్రెండ్స్ బ్యాచ్‌లో నటించిన నరేంద్ర రవి సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాడు. సింపుల్ డైలాగ్స్‌తోనే ప్రేక్షకులను నవ్వించే విషయంలో సక్సెస్ అయ్యాడు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఉపేంద్ర లిమాయే కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఒక కామియో చేసిన దర్శకుడు కనిపించినంత సేపు స్క్రీన్ మీద నవ్వులు పూయించాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సంగీతం బావుంది, పాటలు బాగున్నాయి. చాలా వరకు నేపథ్య సంగీతం కూడా వర్కౌట్ అయింది. అయితే ఎడిటింగ్ మీద కొంతవరకు వర్క్ చేసి ఉండవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ, ‘రోమాంచకం’ కొంచెం హాస్యం, కొంచెం ఉత్కంఠ!