
Hamas Crypto Funding: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ కోసం సమీకరించిన 5.6 లక్షల డాలర్లకు పైగా విలువైన క్రిప్టోకరెన్సీని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా హమాస్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ నిధుల సమీకరణ, నియామకాల నెట్‌వర్క్‌కు కూడా అంతరాయం కలిగించినట్లు అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. మంగళవారం ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. హమాస్ నిధుల సేకరణ, నియామకాల కోసం ఉపయోగించిన వెబ్‌సైట్ డొమైన్‌లు, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే హమాస్‌కు డబ్బు విరాళంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సంస్థను సంప్రదించిన వేలాది మంది వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా గుర్తించినట్లు వెల్లడించింది.
‘హమాస్ నెట్‌వర్క్‌లు సురక్షితం కావు’
ఈ ఆపరేషన్‌పై డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యూఎస్ అటార్నీ జీనైన్ పిర్రో తీవ్రంగా స్పందించారు. హమాస్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. “మీ నెట్‌వర్క్‌లు సురక్షితం కాదు. మీ క్రిప్టో కూడా సురక్షితం కాదు. యుద్ధం చేసే మీ సామర్థ్యాన్ని నాశనం చేసే వరకు మేము ఆగం” అని ఆమె వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. FBI దర్యాప్తులో భాగంగా దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం.. హమాస్ 2019లోనే క్రిప్టోకరెన్సీ ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఆ సంస్థ సైనిక విభాగమైన ఖస్సాం బ్రిగేడ్స్ ద్వారా వర్చువల్ కరెన్సీలో విరాళాలు సేకరించినట్లు అధికారులు గుర్తించారు.
హమాస్ తన టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా విరాళాలను కోరడంతో పాటు, ప్రత్యక్షంగా ఆన్‌లైన్ నిధుల సేకరణ కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. క్రిప్టో లావాదేవీలను గుర్తించడం కష్టమని హమాస్ అధికారులు పేర్కొన్నట్లు FBI అఫిడవిట్లలో ప్రస్తావించింది. అనామకంగా క్రిప్టో విరాళాలు ఎలా అందించాలనే వివరాలను కూడా హమాస్‌కు సంబంధించిన వెబ్‌సైట్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు FBI వెల్లడించింది. ఖస్సాం బ్రిగేడ్స్‌కు వర్చువల్ కరెన్సీ ద్వారా విరాళాలు సేకరిస్తున్న నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అదే సమయంలో హమాస్‌తో సంబంధం ఉన్న ఈమెయిల్ చిరునామాకు విరాళాలు పంపాలని కోరుతూ టెలిగ్రామ్‌లో చేసిన ఓ పోస్టుపై అమెరికా ఇంటిలిజెన్స్ నెట్‌వర్క్ అధికారులను అప్రమత్తం చేసిందని తెలిపారు. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
డిజిటల్ నెట్‌వర్క్‌లపై ఎఫ్‌బిఐ ఫోకస్
FBI సైబర్ విభాగానికి బాధ్యత వహించే సహాయ డైరెక్టర్ బ్రెట్ లీథర్‌మాన్ మాట్లాడుతూ.. అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు, ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల కోసం డిజిటల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా నిరోధించేందుకు తమ సంస్థ తన అధికారాలను నిరంతరం వినియోగిస్తుందని తెలిపారు.