
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే విభిన్నమైన సినిమాలకు అండగా నిలుస్తున్న ఆయన ఇప్పుడు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద మాల్స్‌లో ఉండే మల్టీప్లెక్స్‌లకు భిన్నంగా, కాఫీ షాప్‌కు వెళ్లినట్టుగా ఈ సినిమా థియేటర్లను ఏర్పాటు చేయాలని రానా ప్లాన్ చేస్తున్నారు. ‘ది అసెంబ్లీ రూమ్స్’ పేరుతో ఈ బోటిక్ థియేటర్ కొత్త కాన్సెప్ట్ ను మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మామూలుగా సినిమా థియేటర్ అంటే భారీ స్క్రీన్, వందలాది సీట్లు, మల్టీప్లెక్స్ వాతావరణం గుర్తుకు వస్తాయి. అయితే రానా ఆ ఫార్మాట్‌కు భిన్నంగా ఆలోచిస్తున్నారు. చిన్న సంఖ్యలో ప్రేక్షకులు కూర్చునేలా, కొద్దిపాటి స్క్రీన్‌లతో ‘ది అసెంబ్లీ రూమ్స్’ రూపు దిద్దుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్లలో సుమారు 50 నుంచి 80 సీట్లు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా సినిమా చూసే ఫీల్ కి ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతారని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి థియేటర్‌ను ఊటీలో నిర్మిస్తున్నారు. దీనికి ‘ది అసెంబ్లీ రూమ్ జిముటి’ అనే పేరు పెట్టారు. ప్రశాంతమైన వాతావరణానికి పేరుగాంచిన ఊటిలో ఇలాంటి థియేటర్‌ను ఏర్పాటు చేయడం కూడా ప్రత్యేకత సంతరించుకుంటోంది. దీంతో పాటు హైదరాబాద్‌లో మరో థియేటర్‌ను నిర్మిస్తున్నట్లు రానా వెల్లడించారు. బెంగళూరులో కూడా ఒకటి లేదా రెండు థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ థియేటర్ల వెనుక వ్యాపార ఆలోచన మాత్రమే లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ, ఇండిపెండెంట్ సినిమాలకు సరైన థియేట్రికల్ స్పేస్ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రానా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు రూపొందించినప్పటికీ, భారీ కమర్షియల్ సినిమాల కారణంగా చిన్న సినిమాలకు తగినన్ని స్క్రీన్‌లు దొరకడం చాలా సందర్భాల్లో సవాలుగా మారుతోంది. అలాంటి సినిమాలకు ‘ది అసెంబ్లీ రూమ్స్’ ఒక ప్రత్యామ్నాయంగా నిలవాలని రానా భావిస్తున్నారు.
మల్టీప్లెక్స్ అనుభవాన్ని కూడా రానా మార్చాలని చూస్తున్నారు. మాల్‌లో కారు పార్క్ చేసి, అంతస్తులు తిరిగి, చివరకు థియేటర్‌కు చేరుకునే అనుభవానికి బదులుగా ప్రేక్షకులు ఒక కాఫీ షాప్‌కు వెళ్లినట్టుగా సులభంగా, ప్రశాంతంగా సినిమా చూసే వాతావరణం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. నిర్మాతగా రానా ఇప్పటికే కొత్త దర్శకులు, విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనకు చెందిన స్పిరిట్ మీడియా ద్వారా కొత్త వారిని ప్రోత్సహిస్తూ పలు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్ సినిమాలకు ప్రత్యామ్నాయ ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఊటీతో మొదలై హైదరాబాద్, బెంగళూరుకు విస్తరించనున్న ఈ బోటిక్ థియేటర్ కాన్సెప్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఇలాంటి చిన్న సినిమా స్పేస్‌లు ఏర్పడే అవకాశం ఉంది.