Reading Time: < 1 minute
New York Times Square Stabbing Woman Attacks Two Killed Police Shooting

Times Square Stabbing: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళ అకస్మాత్తుగా కత్తితో ఇద్దరిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరోకరు గాయపడ్డాడు. అనంతరం పోలీసులు ఆమెపై జరిపిన కాల్పుల్లో నిందితురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 4:36 గంటలకు టైమ్స్ స్క్వేర్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో వేలాది మంది పర్యాటకులు, సాధారణ ప్రజలు ఆ ప్రాంగణంలో ఉన్నారు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే నిందితురాలు ఇద్దరిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. నిందితురాలిని 49 ఏళ్ల పమేలా సిస్నెరోస్‌గా గుర్తించారు. ఆమె 32 ఏళ్ల మహిళతో పాటు 68 ఏళ్ల వ్యక్తిపై కత్తితో దాడి చేసింది. మహిళ పొత్తికడుపులో కత్తిపోటు తగలడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరో బాధితుడికి కూడా పొత్తికడుపులో గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేరే టైంలో అతడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో పింక్ షర్ట్, జీన్స్ ధరించిన నిందితురాలు చేతిలో కత్తితో పోలీసుల ఎదుట నిలబడి కనిపించింది. కత్తిని కిందపడేయడానికి ఆమె నిరాకరించడంతో పాటు పోలీసులను చంపేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది.

నిందితురాలిపై ముందు పోలీసులు టేజర్‌ను ప్రయోగించినప్పటికీ అది పనిచేయలేదు. దీంతో నిందితురాలు కత్తిని ఊపుతూ పోలీసుల వైపు ముందుకు వెళ్లడంతో.. అధికారులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడింది. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. నిందితురాలికి గతంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించిందని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు. ప్రాథమికంగా ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా భావించడం లేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.