
జపాన్‌లో పనిచేస్తున్న తెలంగాణ నర్సులతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. టామ్‌కామ్ బృందంతో కలిసి టోక్యో వెళ్లిన మంత్రి.. అక్కడ పనిచేస్తున్న నర్సుల పని అనుభవాలు, ఉద్యోగ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
రెండేళ్ల క్రితం టామ్‌కామ్ ద్వారా జపాన్‌కు వెళ్లిన తొలి బ్యాచ్ నర్సులు.. తమ పని వాతావరణం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం జపాన్‌లో 30 మంది తెలంగాణ నర్సులు పనిచేస్తున్నారని.. జపనీస్ భాష నేర్చుకున్న వారికి అక్కడ భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని వారు మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జర్మన్, జపాన్ భాషల్లో శిక్షణ ఇస్తూ రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణతో పాటు, ఉద్యోగాలు కల్పించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.