
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల నుంచి కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలకే సమాధానాలు ఆశించరు. అభ్యర్థి సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచన, పరిశీలనా శక్తి, ప్రశ్నను అర్థం చేసుకునే విధానం వంటి అంశాలను కూడా పరీక్షిస్తారు. అందుకే ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు వినడానికి చాలా సులభంగా ఉన్నప్పటికీ.. సమాధానం మాత్రం కాస్త ఆలోచించిన తర్వాతే తట్టేలా ఉంటాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన ట్రిక్కీ ప్రశ్నే ఇది.
ప్రశ్న ఏంటంటే?
‘ఆదర్శ్, అనుపమ్ అనే కవలలు మేలో జన్మించారు. కానీ వారి పుట్టినరోజు జూన్‌లో ఉంటుంది. ఇది ఎలా సాధ్యం?’
సాధారణంగా ఈ ప్రశ్న వింటే చాలామంది వెంటనే అయోమయానికి గురవుతారు. ఎందుకంటే ఎవరైనా మే నెలలో జన్మిస్తే.. వారి పుట్టినరోజు కూడా మే నెలలోనే వస్తుందని మనం సహజంగా భావిస్తాం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ‘May’ అనేది ఇక్కడ నెల పేరు కాదు.. ఒక పట్టణం పేరు. అంటే ఆదర్శ్, అనుపమ్ అనే కవలలు May అనే పట్టణంలో జన్మించారు. వారు మే నెలలోనే పుట్టారని ప్రశ్నలో ఎక్కడా చెప్పలేదు. వారు May అనే ప్రాంతంలో జన్మించారు. అయితే వారి పుట్టినరోజు జూన్‌లో వస్తుంది.
ప్రశ్నలోని అసలు ట్రిక్ ఇదే..
ఈ ప్రశ్నలో ‘born in May’ అనే వాక్యాన్ని మనం సాధారణంగా ‘మే నెలలో పుట్టారు’ అని అర్థం చేసుకుంటాం. కానీ ‘May’ అనే పదానికి ప్రాంతం/ పట్టణం పేరు అనే మరో అర్థానికి కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి ప్రశ్నల్లో ప్రశ్న అడిగిన వ్యక్తి మనం సాధారణంగా తీసుకునే అర్థాన్ని కాకుండా.. ప్రత్యామ్నాయ అర్థాన్ని గుర్తించగలమా? లేదా? అనేది పరీక్షిస్తారు.
UPSC ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే..?
UPSC ఇంటర్వ్యూ అనేది కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే పరీక్ష కాదు. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అభ్యర్థికి ఒక ప్రశ్న ఎదురైనప్పుడు.. ప్రశ్నను పూర్తిగా వింటున్నారా? ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారా? తొందరపడి సమాధానం చెబుతున్నారా? సమస్యను మరో కోణంలో ఆలోచించగలరా? ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆలోచించగలరా? సాధారణ ఆలోచనకు భిన్నంగా తార్కిక సమాధానం ఇవ్వగలరా?.. అనే అంశాలను పరిశీలిస్తారు.
ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు వెంటనే తెలిసిన సమాధానం చెప్పేయకుండా ప్రశ్నలో ఉపయోగించిన పదాలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. ఒక్కోసారి ప్రశ్నలోనే సమాధానానికి సంబంధించిన క్లూ దాగి ఉంటుంది. అయితే ఈ ప్రశ్న నిజంగా UPSC సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో 98వ ర్యాంకు సాధించిన ఓ అభ్యర్థిని అడిగినది. కాబట్టి UPSC ఇంటర్వ్యూ ఈ తరహా ట్రిక్కీ ప్రశ్నలు వస్తే ఎలా స్పందించాలో.. ఏ విధంగా సమాధానం ఇవ్వాలో తెలుసుకోవచ్చు.