
సుదూర విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు తరచూ ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. కొన్ని గంటల పాటు ప్రయాణికులకు సేవలందించిన తర్వాత కొంతమంది ఎయిర్ హోస్టెస్‌లు, క్యాబిన్ సిబ్బంది ఒక్కసారిగా కనిపించకుండా పోతారు. మరికొంతసేపటి తర్వాత కొత్త సిబ్బంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంటారు. ఇంతకీ ఆ సమయంలో వారు ఎక్కడికి వెళ్తారు? విమానంలోనే సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుందా? అనేది చాలా మంది తెలియకపోవచ్చు.
స్పెషల్ కంపార్ట్‌మెంట్..
పెద్ద సుదూర విమానాల్లో క్రూ రెస్ట్ ఏరియా లేదా క్రూ రెస్ట్ కంపార్ట్‌మెంట్ అనే ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇది సాధారణ ప్రయాణికుల క్యాబిన్‌కు దూరంగా, ప్రయాణికులకు సాధారణంగా కనిపించని ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. విమానం మోడల్‌ను బట్టి ఈ ప్రాంతం పైభాగంలో లేదా మరొక ప్రత్యేక విభాగంలో ఉండవచ్చు. ఈ ప్రాంతంలోకి వెళ్లేందుకు కొన్ని విమానాల్లో చిన్న మెట్లు లేదా నిచ్చెనను ఉపయోగించాల్సి ఉంటుంది. లోపల పెద్ద గది ఉండదు. బదులుగా, చిన్న చిన్న బంక్‌లుగా విభజించిన నిద్రించే కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ప్రతి సిబ్బంది సభ్యుడు కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా వీటిని రూపొందిస్తారు.
పలు రకాల సౌకర్యాలు..
ఈ బంక్‌లలో పరుపులు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత వస్తువులు ఉంచుకునేందుకు చిన్న స్టోరేజ్ సదుపాయం కూడా ఉంటుంది. ప్రయాణికుల క్యాబిన్‌లోని శబ్దం, వెలుతురు, రద్దీకి దూరంగా సిబ్బంది ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేలా వీటిని రూపొందిస్తారు. ముఖ్యంగా 12 నుంచి 15 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో సిబ్బందికి నిర్దిష్ట విశ్రాంతి సమయాలు కేటాయిస్తారు. ఒక బృందం ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా, మరో బృందం విశ్రాంతి తీసుకుంటుంది. తర్వాత వారు మార్పిడి చేసుకుంటారు.
బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A350 వంటి సుదూర ప్రయాణ విమానాల్లో ఇలాంటి క్రూ రెస్ట్ సదుపాయాలు సాధారణంగా కనిపిస్తాయి. విమానం బయట నుంచి చూస్తే ఈ ప్రాంతం అసలు కనిపించదు. ప్రయాణికుల భద్రత, సిబ్బంది విశ్రాంతి రెండింటినీ దృష్టిలో ఉంచుకుని విమాన తయారీదారులు వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. అందుకే తదుపరిసారి సుదూర విమాన ప్రయాణంలో కొంతమంది ఎయిర్ హోస్టెస్‌లు కనిపించకుండా పోతే.. వారు విమానంలోనే ఉన్న క్రూ రెస్ట్ ఏరియాలో విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు!