Reading Time: 2 minutes
Tukkuguda Nurse Murder Case Scene To Scene Details Of What Happened

Tukkuguda Nurse Murder Case: తుక్కుగూడలోని ప్రైమ్‌ కేర్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర ఆధారాల ఆధారంగా బిహార్‌కు చెందిన సనావుల్లా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి సమీపంలోని మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న అతడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ప్రైమ్‌ కేర్‌ ఆస్పత్రికి సమీపంలోనే ఓ మెకానిక్‌ షాపు ఉంది. ఈ షాపులో సనావుల్లా ఖాన్‌ పనిచేస్తున్నాడు. మెకానిక్‌ షాపు వెనుక భాగంలోనే నర్సుల హాస్టల్‌ ఉంది. హాస్టల్‌లో నర్సులు ఉంటున్న విషయాన్ని సనావుల్లా కొంతకాలంగా గమనిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాఖీ పండుగ నేపథ్యంలో శిరీషతో పాటు హాస్టల్‌లో ఉంటున్న ఇతర నర్సులు తమ స్వగ్రామాలకు వెళ్లారు. దీంతో శుక్రవారం రాత్రి శిరీష మాత్రమే గదిలో ఒంటరిగా ఉన్నట్లు నిందితుడు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే అదనుగా భావించిన సనావుల్లా అర్ధరాత్రి హాస్టల్‌లోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది.

శిరీష ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్‌ లేకపోవడంతో అదే మార్గం ద్వారా సనావుల్లా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే శిరీష నిందితుడిని ప్రతిఘటించి కేకలు వేయడంతో ఆమె అరుపులు బయటకు వినిపించకుండా చేసేందుకు గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెకానిక్‌ షాపు యజమానికి ఫోన్‌ చేసిన సనావుల్లా.. తనకు పెట్రోల్‌ కావాలని అడిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్య విషయం బయటకు రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు అతడు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు శిరీష మృతదేహం బయటపడిన తర్వాత పోలీసులు ఘటనాస్థలంలో దర్యాప్తు ప్రారంభించారు. డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనూ సనావుల్లా అక్కడే ఉన్నాడు కూడా.. అంతేకాదు, పోలీసులను అక్కడ ఏం జరిగిందని ప్రశ్నించడం కోసమెరుపు. అయితే తనిఖీల్లో భాగంగా.. జాగిలం మెకానిక్‌ షాపు వద్దకు వచ్చి ఆగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సనావుల్లాను అదుపులోకి తీసుకుని విచారించారు. సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం అతడిని ప్రశ్నించగా చివరకు హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో శిరీషపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహంపై లైంగిక దాడి జరిగిందా? అనే అంశాన్ని కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సనావుల్లా ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ ఘటనలో అతడితో పాటు మరెవరైనా ఉన్నారా? హత్యకు ముందస్తు ప్రణాళిక ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.