Reading Time: 2 minutes
Motorola Razr 70 Swarovski Edition Teased Ahead Of Ifa 2026

Motorola Razr 70 Swarovski Edition: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫ్యాషన్, టెక్నాలజీని కలిపి కొత్తగా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది మోటరోలా (Motorola) సంస్థ. ప్రముఖ క్రిస్టల్ బ్రాండ్ స్వరోవ్‌స్కీ (Swarovski)తో మరోసారి చేతులు కలిపి.. కొత్త రేజర్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. సెప్టెంబర్ ప్రారంభంలో జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న ఐఎఫ్ఏ 2026 వేదికగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

మోటరోలా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన టీజర్‌లో ఫోన్ వెనుక భాగాన్ని మాత్రమే చూపించింది. నలుపు రంగు బ్యాక్ ప్యానెల్‌పై డైమండ్ ఆకారపు టెక్స్చర్‌తో పాటు అక్కడక్కడా క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకైన చిత్రాలకు దగ్గరగా ఉన్నాయి. ఈ ఫోన్ రేజర్ 70 స్వరోవ్‌స్కీ ఎడిషన్‌గా రానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మోటరోలా రేజర్ 60 స్వరోవ్‌స్కీ ఎడిషన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రేజర్ 70కు స్వరోవ్‌స్కీ డిజైన్‌ను తీసుకరానుంది. గత నెల ప్రారంభంలో లీకైన రెండర్లు కూడా ఈ ఫోన్ డిజైన్‌పై కీలక వివరాలను వెల్లడించాయి. క్విల్టెడ్ డిజైన్‌తో కూడిన బ్లాక్ బ్యాక్ ప్యానెల్‌పై డజన్ల కొద్దీ చిన్న క్రిస్టల్స్, హింజ్ ప్రాంతంలో పెద్ద క్రిస్టల్, బయటి డిస్‌ప్లే కింద మరికొన్ని క్రిస్టల్ డిజైన్‌లు ఉన్నట్లు ఆ ఫొటోల్లో కనిపించింది.

రేజర్ 60 స్వరోవ్‌స్కీ ఎడిషన్‌తో పోలిస్తే కొత్త ఫోన్ డిజైన్ కొంత సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించే అవకాశం ఉంది. నలుపు రంగు బ్యాక్ ప్యానెల్‌కు మెరిసే క్రిస్టల్స్‌ను జోడించడం ద్వారా ఫ్యాషన్ లుక్‌ను అందించనుంది. అంటే సాధారణ ఫోల్డబుల్ ఫోన్‌కు భిన్నంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రీమియం ఫ్యాషన్ యాక్సెసరీలా మోటరోలా రూపొందిస్తున్నారు. హార్డ్‌వేర్ పరంగా రేజర్ 70 స్వరోవ్‌స్కీ ఎడిషన్‌లో స్టాండర్డ్ రేజర్ 70లో ఉన్న ఫీచర్లే ఉండనున్నాయి.

ఇందులో 6.9 అంగుళాల ఇంటర్నల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 4,500mah బ్యాటరీ ఉండనున్నాయి. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో రెండు 50MP కెమెరాలు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే ఫోన్ వెలుపలి భాగంలో 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండనుంది. ఈ డిస్‌ప్లే వెనుక కెమెరాల చుట్టూ విస్తరించే విధంగా రేజర్ సిరీస్ ప్రత్యేక డిజైన్‌ను కొనసాగించనుంది. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌తో పాటు పారదర్శక ప్రొటెక్టివ్ కేస్, యూఎస్‌బీ టైప్-సీ కేబుల్, 33 వాట్ల ఛార్జర్‌ను బాక్స్‌లో అందించే అవకాశం ఉంది. స్టాండర్డ్ మోడల్‌లో ఉన్న 30 వాట్ల వైర్డ్ ఛార్జింగ్‌కు బదులుగా ప్రత్యేక ఎడిషన్‌లో 33 వాట్ల ఛార్జింగ్ ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కొత్త మోడల్ ధర కూడా దాదాపు 1,000 డాలర్ల పరిధిలో ఉండొచ్చని అంచనా. ఐఎఫ్ఏ 2026లో మోటరోలా ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.