
ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంటి శైలిలో ఘుమఘుమలాడే మసాలా టీ తాగాలని ప్రతీ టీ ప్రియుడూ కోరుకుంటారు. కానీ, ఇంట్లో తయారుచేసిన టీ రుచి దుకాణాలలో లేదా ఆఫీస్ క్యాంటీన్లలో అంత సులభంగా లభించదు. కొన్నిసార్లు, ఆ టీ రుచి ఎంత దారుణంగా ఉంటుందంటే అది మీకు సేదతీర్చకపోగా, మీ మూడ్‌ను పాడుచేయగలదు. కాబట్టి, మీరు టీ ప్రియులైతే, లేదా ఒక కప్పు మంచి టీ మీ మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించే ఈ చాయ్ మసాలా రెసిపీ మీ కోసమే.
కావలసిన పదార్థాలు:
యాలకులు: 25 గ్రాములు
లవంగాలు: 10-12 గ్రాములు
దాల్చినచెక్క: 3-4 చిన్న ముక్కలు
మిరియాలు: 1 టేబుల్ స్పూన్
సోంపు: 1 టేబుల్ స్పూన్
సొంటి పొడి (ఎండిన అల్లం పొడి): 2 టేబుల్ స్పూన్లు
జాపత్రి / జాజికాయ ముక్క: చాలా చిన్నది (తగినంత)
తయారుచేసే విధానం:
స్టౌవ్‌పై మందపాటి బాండి పెట్టుకుని తక్కువ మంటపై ఉంచి యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, సోంపులను వేయించాలి. సువాసన వచ్చే వరకు 2-3 నిమిషాలు దోరగా వేయించి, చల్లారనివ్వాలి.
ఇలా వేయించిన సుగంధ ద్రవ్యాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి, అందులో సొంటి పొడి, జాజికాయ ముక్కను కలిపి మరింత మెత్తటి పొడిగా రుబ్బుకోవాలి. ఈ మసాలా పొడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ఉపయోగించే విధానం, చిట్కాలు:
ఒక కప్పు టీ తయారుచేసేటప్పుడు, నీళ్లు, టీ పొడి మరుగుతున్న సమయంలో కేవలం పావు టీస్పూన్ సుమారుగా ఒక చిటికెడు ఈ మసాలా పొడిని వేస్తే సరిపోతుంది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు లేదా ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఈ మసాలా పొడిని చిన్న డబ్బాలో వెంట తీసుకెళ్లవచ్చు. వేడి టీ లేదా వేడి పాలలో ఈ పొడిని కలుపుకుని తాగవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ టీ మసాలా కేవలం రుచినే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో ఉపయోగించిన సొంటి, మిరియాలు జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు, సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజువారీ ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ మసాలా టీ ఎంతగానో తోడ్పడుతుంది.