Reading Time: 2 minutes
PM Kisan: ఈ మూడు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు కట్.. కేంద్రం నుంచి మరో అప్డేట్.. వెంటనే చేస్కోండి..

కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఈ స్కీమ్ అమలు చేస్తోండగా.. దేశంలో కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్దిక సాయం పొందవచ్చు. వీటిని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి వీటిని అందిస్తారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 23వ విడతను ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ విడుదల చేశారు. దీంతో 24వ విడత డబ్బులు ఎప్పుడు పడతాయనే దానిపై రైతుల్లో ఆసక్తి నెలకొంది.

జూన్‌లో 23వ విడత నగదు విడుదల కావడంతో.. నాలుగు నెలల తర్వాత అక్టోబర్ వస్తుంది. దీంతో అక్టోబర్‌లో 24వ విడత నగదును కేంద్రం అందించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ సాయం పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవలం పీఎం కిసాన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాయిదాలను పొందాలంటే అవసరమైన కొన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్లో కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానమై ఉండటం, భూమి రికార్డులు కరెక్ట్‌గా ఉండటం లాంటివి చూసుకోవాలి. ఈ మూడు కరెక్ట్‌గా లేకపోతే డబ్బులు నిలిచిపోవచ్చు. లేదా నగదు పొందటంలో జాప్యం జరగవచ్చు.

రైతు భూమి సమాచారం పీఎం కిసాన్ రికార్డుల్లో నమోదై ధృవీకరించబడి ఉండాలి. అలాగే భూమి రికార్డులు అప్డేట్‌ అయి ఉండాలి. భూమి సమాచారం అసంపూర్తిగా ఉన్నా, వివరాలు తప్పుగా ఉన్నా నగదు అందదు. ఇక డీబీటీ ప్రక్రియ ద్వారా నగదు మీ అకౌంట్లో పడాలంటే బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానమై ఉండాలి. దీంతో బ్యాంక్‌కు వెళ్లి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలి. ఇక పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దీనిని పూర్తి చేయవచ్చు. మీ ఆధార్ మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది. ఇటీవల పార్లమెంట్‌కు కేంద్రం సమర్పించిన వివరాల ప్రకారం..  భూ రికార్డులు సరిగ్గా లేని 16,52,379 మంది లబ్ధిదారులకు, ఆధార్-బ్యాంక్ అకౌంట్ లింక్ కాని 23,53,748 మందికి,  ఇ-కెవైసి పూర్తి చేయని 32,94,609 మందికి చెల్లింపులు నిలిచిపోయినట్లు స్పష్టం చేసింది.