
బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ప్రతీఒక్కరూ తమ ఇంట్లో ఎంతకొంత మొత్తంలో గోల్డ్ కలిగి ఉంటారు. భారతీయులు ఎక్కువగా ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, పంక్షన్లు, పండుగల సమయంలో బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సేల్స్ కాస్త తగ్గాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం శ్రావణ మాసం రావడం, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో బంగారం అమ్మకాలు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతమంది తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని మార్పిడి చేసి కొత్త బంగారం కొంటూ ఉంటారు. ఈ విధానంలో కొనుగోలు చేస్తే ట్యాక్స్ ఉంటుందా..? లేదా? అనేది చూద్దాం.
లాభంపై పన్ను చెల్లించడం తప్పనిసరి
ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. బంగారం ఒక మూలధన ఆస్తిగా భారతదేశంలో పరిగణిస్తారు. దీంతో ట్యాక్స్ కిందకు వస్తుంది. మీరు బంగారాన్ని తక్కువ ధరకు కొని అధిక ధరకు విక్రయిస్తే లాభం పొందినట్లు అవుతుంది. ఆ లాభంపై మీరు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బంగారపు కొనుగోలు, అమ్మకం ధర మధ్య వచ్చే లాభంపై పన్ను విధిస్తారన్నమాట. మీరు వ్యక్తిగత వినియోగం కోసం బంగారం కొనుగోలు చేసినా.. వాటిని అమ్మడం ద్వారా లాభం వస్తే పన్ను పరిధిలోకి వస్తుంది. దీంతో తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. పాత బంగారం అమ్మకం, కొత్త బంగారం అమ్మకం రెండూ వేర్వేరు లావాదేవీలుగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2(14) ప్రకారం వ్యక్తిగత బంగారు ఆభరణాలకు ట్యాక్స్ మినహాయింపు ఉంది. కానీ వాటిని అమ్మడం ద్వారా లాభం వస్తే ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.
వారసత్వంగా వస్తే పన్ను ఉంటుందా..?
ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ట్యాక్స్ నిబంధనలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత ఐటీ నిబంధనల ప్రకారం వీటికి సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను ఉంది. ఇక హోల్డింగ్ పీరియడ్ కంటే ముందే విక్రయిస్తే పన్ను స్లాబ్ ప్రకారం ట్యాక్స్ ఉంటుంది. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లకు సంబంధించి ఈటీఎఫ్ యూనిట్లను 12 నెలలకు మించి ఉంచి ఆ తర్వాత విక్రయిస్తే 12.5 శాతం ఎల్‌టీసీజీ పన్ను పడుతుంది. ఇక గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల విషయంలో నిబంధనలు వేరుగా ఉంటాయి. ఇక వారసత్వంగా వచ్చిన బంగారానికి పన్ను ఉండదు. అయితే వీటిని విక్రయించి లాభం పొందితే మళ్లీ పన్ను పరిధిలోకి వస్తుందని చెప్పవచ్చు. విక్రయించగా వచ్చిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్స్‌గా పిలుస్తారు. దీంతో ఇది పన్ను పరిధిలోకి వస్తుంది.