Reading Time: 2 minutes

మోసకారి తోడేలును చిత్తు చేసిన తెలివైన జింకలు.. పిల్లలకు చెప్పాల్సిన నీతి కథ అంటే ఇది..!

Caption of Image.

​ఒక దట్టమైన అడవిలోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఒక జింకల మంద నివసిస్తూ ఉండేది. ఆ మందకు వయసు పైబడిన దుప్పి నాయకుడిగా ఉండేది. వయసు భారంతోపాటు క్రూర జంతువుల నుంచి తన మందను ప్రతిరోజూ కాపాడుకోవడం ఆ నాయకుడికి రోజురోజుకూ తలకు మించిన భారంగా మారింది.

సరిగ్గా అదే అడవిలో ఒక ముసలి తోడేలు ఉండేది. దానికి కూడా వయసు పైబడటంతో చూపు మందగించి, వేటాడే శక్తి తగ్గిపోయింది. దాంతో కష్టపడకుండా, సులువుగా ఆహారం సంపాదించుకోవడానికి ఆ జింకల మందపై కన్ను వేసింది. ​ఒకరోజు ఆ తోడేలు ఎంతో వినయాన్ని నటిస్తూ జింకల నాయకుడైన దుప్పి ముందుకు వచ్చింది.

​‘‘మిత్రమా! నేను ముసలిదాన్ని అయ్యాను. గతంలో నేను మీకు చేసిన మోసానికి, ద్రోహానికి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇకపై మీ మందకు రాత్రిపూట నేను కాపలాగా ఉండి రక్షణ కల్పిస్తాను. నన్ను నమ్ము’’ అని ఎంతో ప్రాధేయపడింది. ​రక్షణ భారంతో అలసిపోయిన దుప్పి, ఆ తోడేలు ముసలితనాన్ని చూసి జాలిపడింది. అది వేటాడలేదు కాబట్టి తమకు ఎలాంటి ముప్పు ఉండదని అమాయకంగా నమ్మింది. మందలోని కొన్ని జింకలు తోడేలు మాటలను అనుమానించినా, తమ నాయకుడి నిర్ణయాన్ని కాదనలేక మౌనంగా ఒప్పుకున్నాయి. ఆ రాత్రికి జింకలన్నీ కొండ గుహలోకి చేరి విశ్రాంతి తీసుకోసాగాయి. తోడేలు గుహ ముందు నిలబడి కాపలా కాయడం మొదలుపెట్టింది.

​నాయకుడి మాట జవదాటలేకపోయినా, మందలోని కొన్ని తెలివైన దుప్పులు జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించాయి. శత్రువు స్వభావాన్ని నమ్మి అసలుకే మోసం తెచ్చుకోకూడదని భావించాయి. అందుకే అవి మందకు నలువైపులా చేరి, నిద్రపోతున్నట్టు నటిస్తూ చాలా అప్రమత్తంగా వేచి ఉన్నాయి. అర్ధరాత్రివేళ మందంతా గాఢ నిద్రలో ఉందనుకుని, తోడేలు తన అసలు రూపాన్ని బయటపెట్టింది. దానికి ఒక్కసారిగా ఆకలి పెరిగిపోయింది. నిద్రిస్తున్న ముసలి జింకలను, చిన్న పిల్లలను చూడగానే నోరూరింది. గుహలోకి నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి, ఒక చిన్న జింకపిల్లను నోట కరుచుకోబోయింది.

అప్పుడే నిద్ర నటిస్తున్న తెలివైన దుప్పులు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ మందను హెచ్చరించాయి. ఆ అరుపులకు గుహలోని జింకలన్నీ క్షణాల మీద లేచి నిలబడ్డాయి. తోడేలు ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయింది. అది తేరుకునేలోపే, బలమైన కొమ్ములున్న మగ జింకలు ఒకేసారి దానిపైకి దూకాయి. గుహ లోపలికివచ్చే దారి ఇరుకుగా ఉండటంతో తోడేలుకు తప్పించుకునే అవకాశం లేకపోయింది. యువ జింకలన్నీ ఏకమై తమ పదునైన కొమ్ములతో దాన్ని అన్నివైపుల నుంచి పొడవడం మొదలుపెట్టాయి.

ఆ ఉమ్మడి దాడికి తట్టుకోలేక, ఒళ్లంతా గాయాలతో ప్రాణభయంతో అరుస్తూ ఆ తోడేలు అడవిలోకి పరుగులు తీసింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నడూ ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదు.​ముసలివాడైన జింకల నాయకుడు దుప్పి, శత్రువు మాయమాటలు నమ్మి తాను చేసిన పొరపాటును తెలుసుకుంది. వివేకంతో, ముందుచూపుతో ప్రమాదాన్ని ఊహించి, ఐకమత్యంతో ఆ వినాశనాన్ని తిప్పికొట్టిన తన మందలోని తెలివైన జింకలను ఎంతో గర్వంగా అభినందించింది.

డా. పోతగాని సత్యనారాయణ

* మీరూ లైఫ్కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా ?

* అయితే.. కథను హామీపత్రంతో పాటు featureseditor@v6velugu.comకి మెయిల్​చేయండి.

©️ VIL Media Pvt Ltd.