
Laikey Laikaa: బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ ఎంట్రీకి ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే నటన పరంగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. అలా సినిమాలలో ఆరంగేట్రం చేసిన స్టార్ కిడ్స్ లో రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కూడా ఒకరు. తన నటనతో గుర్తింపు తెచ్చుకోవడానికి తన వంతు ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు. ‘ఆజాద్’ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు ‘లైకీ లైకా’ అనే ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్, రీషూట్ కారణంగా పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఒక దశలో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
‘లైకీ లైకా’ను వాలెంటైన్స్ డే సందర్భంగా 2027 ఫిబ్రవరి 14న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. సౌరభ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫాంటమ్ స్టూడియోస్ నిర్మిస్తోంది. రాషా థడానీతో పాటు ‘ముంజ్య’ ఫేమ్ అభయ్ వర్మ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ప్రేమకథకు యాక్షన్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘ప్రేమ.. నొప్పి.. నమ్మకం’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీ రొమాంటిక్ సినిమాలకు భిన్నంగా ఇంటెన్స్ ట్రీట్‌మెంట్‌తో ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే హింట్ ఇచ్చాయి.
వాస్తవానికి ‘లైకీ లైకా’ను 2026 వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ తొలుత భావించారు. అయితే కొన్ని సన్నివేశాల అవుట్ పుట్ కి సంతృప్తి చెందకపోవడం, ప్రమోషన్స్‌కు సరైన సమయం కేటాయించడం వంటి కారణాలతో రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయడానికి దర్శకుడు సౌరభ్ గుప్తా నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ రీషూట్ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు కొనసాగుతున్నట్లు సమాచారం. దర్శకుడు తాను అనుకున్న స్థాయిలో సినిమాను తెరపైకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లలో రాషా, అభయ్ వర్మ ఇద్దరూ గాయాలతో, రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
రాషా థడానీ విషయానికి వస్తే, ఆమెకు ‘ఆజాద్’ తొలి అవకాశంగా నిలిచింది. అజయ్ దేవగణ్, అమన్ దేవగన్ తదితరులు నటించిన ఈ సినిమాలో రాషా తన నటనతో పాటు డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో తన రెండో హిందీ సినిమాతో రాషా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది. మరోవైపు హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ‘ముంజ్య’ ఫేమ్ అభయ్ వర్మ ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో హీరోగా కనిపించనున్నాడు. ‘ఆజాద్’ తర్వాత రాషా థడానీకి ‘లైకీ లైకా’ ఎలాంటి బ్రేక్ ఇస్తుంది? అభయ్ వర్మతో ఆమె కెమిస్ట్రీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? దర్శకుడు సౌరభ్ గుప్తా రీషూట్‌లతో సినిమాను ఎంతవరకు మెరుగుపరిచారో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.
ఇక రాషా థడానీ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త తెలుగు చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం కాగా, రాషా ఇందులో ‘మంగ’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించారు. 2026న జూలై 29 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.