Reading Time: < 1 minute

కౌశిక్ రెడ్డిని పిలుద్దాం..వివరణ అడగాలని ఎథిక్స్ కమిటీ మీటింగ్‌‌‌‌లో నిర్ణయం

Caption of Image.
  •     ఇతర సభ్యుల తీరుపై కూడా చర్చ జరగాలన్న బీఆర్ఎస్ సభ్యులు
  •     అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తర్వాత మరోసారి మీటింగ్ నిర్వహించాలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అందిన ఫిర్యాదుపై ఆయన్ను పిలిచి వివరణ అడగాలని ఎథిక్స్‌‌‌‌ కమిటీ నిర్ణయించింది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌‌‌‌లో  కమిటీ భేటీ జరిగింది. చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సభ్యులైన ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, పైడి రాకేశ్​రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. మార్చి 29న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరి వైపు వేలు చూపిస్తూ కౌశిక్ రెడ్డి సభ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని కమిటీకి అందిన ఫిర్యాదుపై చర్చ జరిగింది. 

సభలో కౌశిక్ అనైతిక ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ సభ్యుడు మధుసూదన్ రెడ్డి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీ సభ్యులు కౌశిక్‌‌‌‌ను సమర్థిస్తున్నారని, ఈ రెండు పార్టీల సభ్యులు ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడంతో ఈ రెండు పార్టీలు ఒకటే అంటూ కమిటీ ముందు కాంగ్రెస్ సభ్యుడు తన వాదన వినిపించారు. బీఆర్ఎస్ హయాంలో అకారణంగా కాంగ్రెస్ సభ్యులైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేసిన విషయాన్ని కమిటీ ముందు ప్రస్తావించారు. ఎలాంటి నైతికత లేకుండానే బీఆర్ఎస్ రాజకీయాలు చేసిందని విమర్శించారు. 

ఆడియోలో ఏమీ లేదు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యులు

వీడియోలో కౌశిక్ రెడ్డి వేలు చూపించడం ఒక్కటే ఉందని, ఆడియో ఏమీ లేదని బీఆర్ఎస్ సభ్యులు వాదించారు. ఆయన ఎక్కడ కూడా అనైతికంగా ప్రవర్తించినట్టు ఆధారాలు లేవని అన్నారు.  కౌశిక్ రెడ్డి ఒక్కరి గురించే కాకుండా సభలో ఇతర సభ్యులు మాట్లాడిన తీరుపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై వచ్చిన అభియోగాలన్నీ తప్పని ఆ పార్టీ సభ్యులు చెప్పారు. మళ్లీ జరగనున్న ఎథిక్స్ కమిటీ సమావేశంలో కౌశిక్ రెడ్డి అంశంపైనే ప్రధానంగా చర్చ సాగనుంది.

©️ VIL Media Pvt Ltd.