Reading Time: 2 minutes
Homemade Rose Water Recipe For Fresh And Hydrated Skin Easy Diy Method

Rose Water: చర్మాన్ని అందంగా, తాజాగా ఉంచుకోవడానికి చాలామంది రకరకాల స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. వాటిలో రోజ్‌ వాటర్‌ (గులాబీ నీరు) ప్రముఖంగా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఒకటి. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడంలో, చర్మం పీహెచ్‌ బ్యాలెన్స్‌ను కాపాడడంలో, ముఖానికి సహజమైన కాంతిని అందించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ముఖ్యంగా వేసవిలో సన్‌బర్న్‌ కారణంగా కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి, చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి రోజ్‌ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తారు.

మార్కెట్‌లో రోజ్‌ వాటర్‌ సులభంగా లభిస్తుంది. అయితే కొద్దిపాటి శ్రమతో ఇంట్లోనే గులాబీ రేకులతో రోజ్‌ వాటర్‌ తయారు చేసుకోవచ్చు. దీనిని టోనర్‌ లేదా ఫేస్‌ మిస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫేస్‌ ప్యాక్‌లో కలిపి కూడా అప్లై చేయవచ్చు. మరి ఇంట్లో రోజ్‌ వాటర్‌ తయారీకి కావాల్సినవి..

* తాజా గులాబీ రేకులు – 3 కప్పులు
* శుభ్రమైన నీరు – 3 కప్పులు

మొదటి పద్ధతి..

ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా కడగాలి. అనంతరం ఒక పాత్రలో శుభ్రమైన నీటిని పోసి అందులో గులాబీ రేకులను వేయాలి. రేకులు పూర్తిగా నీటిలో మునిగేంత మేర మాత్రమే నీటిని తీసుకోవాలి. ఇప్పుడు పాత్రను మీడియం మంటపై ఉంచి నీటిని మెల్లగా వేడి చేయాలి. నీటిని ఎక్కువ మంటపై పెట్టి బాగా మరిగించకూడదు. కొంత సమయం తర్వాత గులాబీ రేకుల రంగు, సువాసన నీటిలోకి చేరడం ప్రారంభమవుతుంది. రేకులు తమ రంగును పూర్తిగా కోల్పోయిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఆ నీటిని వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం శుభ్రమైన గాజు సీసా లేదా స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనిని ఫేస్‌ టోనర్‌ లేదా ఫేస్‌ మిస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు.

రెండో పద్ధతి..

ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేయాలి. రేకులు పూర్తిగా మునిగేంత వరకు నీటిని పోయాలి. అనంతరం పాత్రను మీడియం మంటపై ఉంచాలి. నీరు వేడెక్కడం ప్రారంభమైనప్పుడు పాత్రపై మూతను తలకిందులుగా పెట్టాలి. ఆ మూతపై కొన్ని ఐస్‌ ముక్కలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాత్రలో ఏర్పడే ఆవిరి చల్లటి మూతను తాకి నీటి బిందువులుగా మారుతుంది. ఆ బిందువులు పాత్రలోకి చేరుతాయి. ఇలా సేకరించిన నీటినే రోజ్‌ వాటర్‌గా ఉపయోగించవచ్చు. కొంత సమయం తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి, తయారైన రోజ్‌ వాటర్‌ను వడకట్టాలి. అనంతరం శుభ్రమైన బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.

ఇంట్లో తయారు చేసుకున్న రోజ్‌ వాటర్‌ను మీ రోజువారీ స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో భాగంగా చేసుకోవచ్చు. ఇది ముఖానికి ఫ్రెష్‌నెస్‌ను అందించడంతో పాటు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే గులాబీ రేకులకు పురుగుమందులు లేదా ఇతర రసాయనాలు ఉండే అవకాశం ఉన్నందున, స్కిన్‌ కేర్‌ కోసం కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ చేయని, శుభ్రమైన గులాబీలను మాత్రమే ఉపయోగించడం మంచిది. తయారు చేసిన రోజ్‌ వాటర్‌ను శుభ్రమైన సీసాలో ఫ్రిజ్‌లో ఉంచి, వాసన లేదా రంగులో మార్పు కనిపిస్తే ఉపయోగించకపోవడం మంచిది.