Reading Time: 2 minutes
Pan Card: పాన్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటివి అప్డేట్ చేసుకోవాలా..? మొబైల్‌ ద్వారా నిమిషాల్లోనే పూర్తి.. ఎలా అంటే..?

భారత్‌లో ఆధార్ కార్డు తర్వాత అత్యంత ముఖ్యమైన పత్రాలలో పాన్ కార్డ్ ఒకటని చెప్పవచ్చు. బ్యాంకు అకౌంట్ తెరవడం, ఐటీఆర్ దాఖలు చేయడం, అధిక విలువ గల లావాదేవీలు చేయడం లాంటి అన్ని ఆర్ధిక లావాదేవీలకు ఇది ఉపయోపడుతుంది. ఇది లేకుండా ఎలాంటి పెద్ద లావాదేవీలు చేయలేరు. ఆస్తి కొనుగోలు చేసినా అమ్మినా, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా దీని అవసరం పడుతుంది. దీంతో పాన్ కార్డ్‌లో వివరాలన్నీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటివి తప్పుగా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఈ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే సులువుగా మార్చుకోవచ్చు. ఏ ఆఫీస్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఇంటి వద్ద నుంచే అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.

ఎలా అప్డేట్ చేసుకోవాలి..?

-ముందుగా NSDL (ప్రొటీన్ ఇ-గవర్నమెంట్) లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి

– “PANలో మార్పులు/సవరణ” అనే ఆప్షన్‌ సెలక్ట్ చేసుకోండి

– మీ పాన్ నంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇమెయిల్ ఐడీ వివరాలను నమోదు చేయండి

-అనంతరం 15 అంకెల టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది

– ఆ తర్వాత మీరు మార్చాలనుకుంటున్న వివరాలను ఎంచుకుని వివరాలు నమోదు చేయండి

-అనంతరం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి

– అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఫోటోగ్రాఫ్, సంతకం వంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది

-మీరు ఏ వివరాలు అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిని బట్టి అవసరమైన పత్రాలు అడుగుతారు

– దరఖాస్తును సమర్పించే ముందు ఒక్కసారి మళ్లీ చెక్ చేసుకోండి

ఎన్ని రోజులకు అప్డేట్ అవుతుంది..?

-మీరు ఆన్లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్డేట్ అవ్వడానికి సుమారు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. మీరు అందించిన సమాచారం లేదా డాక్యుమెంట్లలో లోపం ఉంటే ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పట్టవచ్చు. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అక్‌నాలెడ్జ్ మెంట్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దీని ద్వారా మీ పాన్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.  ఇక అప్డేట్ చేసుకునేందుకు రుసుం ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో నివసిస్తున్నవారికి  GSTతో కలిపి రూ. 50 ఖర్చవుతుంది. భారతదేశం వెలుపల నివసిస్తున్నవారికి రూ. 959 ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాత యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ రుసుం చెల్లించవచ్చు.