Reading Time: < 1 minute
Folk Singer Kittu Pawan Debut Movie Launch Chandrabose Rp Patnaik

జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యం.యస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా బ్యానర్లపై ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి (ప్రొడక్షన్ నెం. 3) దిలీప్ సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మాదాపూర్‌లోని శివమ్ మీడియా కార్యాలయంలో శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. హీరో కిట్టు పవన్‌పై ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ క్లాప్ కొట్టగా, ప్రముఖ సంగీత దర్శకుడు, డైరెక్టర్ ఆర్.పి. పట్నాయక్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. నేషనల్ అవార్డ్ విన్నర్, దర్శకుడు సతీష్ వేగేశ్న, ఫోక్ సింగర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ కలిసి దర్శకుడు దిలీప్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబోస్.. ఈ చిత్ర బృందంలోని ప్రతిభ తనకు బాగా తెలుసని, తనకు ఎంతో ఆత్మీయులైన నిర్మాతలు, సంగీత దర్శకుడు మదిన్‌కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. మంచి కథతో వస్తున్న దర్శకుడు దిలీప్‌కు నిర్మాతలు పూర్తి మద్దతు ఇస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ సూపర్ హిట్ కావాలని సతీష్ వేగేశ్న అన్నారు. ఆర్.పి. పట్నాయక్ స్పందిస్తూ.. ఈ నిర్మాతలు భవిష్యత్తులో పదుల సంఖ్యలో సినిమాలు తీసి పెద్ద స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తనను ప్రోత్సహించడానికి సినీ పెద్దలు రావడం పట్ల హీరో కిట్టు పవన్ భావోద్వేగానికి గురయ్యారు. ఒక సాధారణ జానపద కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన తనకు, తొలి సినిమాకే ఇంతటి ఉద్ధండులు వచ్చి ఆశీర్వదించడం ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, సినిమాటోగ్రాఫర్ జనతా బబ్లూ, నూతన దర్శకుడు కృష్ణకాంత్‌తో పాటు పలువురు జానపద కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.