
శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం గూటిబయలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను ప్రకృతి వింతల్లోకెల్లా అద్భుతమైన మహావృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఒకే కాండంతో మొదలై దాదాపు ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో 6,869 ఊడలతో విస్తరించిన ఈ మహా వటవృక్షం పర్యాటకులను, భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. 660 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ఈ మర్రిమాను ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. బుక్కపట్టణం గ్రామానికి చెందిన శెన్నాక్క వేంకటప్ప, మంగమాంబ దంపతులకు 1394లో జన్మించిన తిమ్మమ్మను గూటిబైలు సంస్థాన ప్రతినిధి బాలవీరయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించడంతో పాటు సామాజిక సంక్షేమానికి కృషిచేసినట్లు చరిత్ర చెప్తుంది. అయితే భర్త కుష్టు వ్యాధిగ్రస్తుడై మరణించడంతో పతిభక్తి పరాయణురాలైన తిమ్మమ్మ 1434లో సతీసహగమనం చేసింది. ఆ సమయంలో చితి కోసం ఏర్పాటు చేసిన నాలుగు ఎండిన మర్రి గుంజల్లో ఈశాన్య దిశలోని గుంజ చిగురించి, నేడు ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన మహా వటవృక్షంగా మారిందని స్థానిక చరిత్ర చెబుతోంది.
విశిష్ట నమ్మకాలు – ఆశ్చర్యపరిచే నిజాలు
ఈ పవిత్ర వృక్షంపై ఏ పక్షీ మలవిసర్జన చేయదని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా సాయంత్రం 6 గంటలు కాగానే పక్షులన్నీ చెట్టును విడిచి వెళ్లిపోవడం ఇక్కడి మరో విశేషం. పిల్లలు లేని దంపతులు ఈ చెట్టు కింద ఉన్న తిమ్మమ్మ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ నమ్మకం. ప్రతి ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ భారీ జాతర నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.
పర్యాటక అభివృద్ధి – ప్రసాద్ పథకం నిధులు
1992లో అటవీ శాఖ ఆధీనంలోకి వచ్చిన ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పలు నిధులతో అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా రూ. 34 లక్షలతో అతిథి భవనం, వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ. 12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ ద్వారా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కటారుపల్లి యోగివేమన సమాధితో పాటు తిమ్మమ్మ మర్రిమానును ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కారిడార్‌గా మరింత అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.