Reading Time: 2 minutes

2027 వరల్డ్ కప్ వరకు ఎవరు బరిలో ఉండేదెవరు? రోహిత్ vs కోహ్లీలలో ఒకరికే ఛాన్స్!

Caption of Image.

Rohit vs Kohli: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అంతర్జాతీయ కెరీర్‌లో చివరి ఘట్టానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న ఈ ఇద్దరికీ 2027 ప్రపంచకపే లాస్ట్ టార్గెట్.. 19 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ వయస్సు ప్రస్తుతం 39 ఏళ్లు కాగా, 18 ఏళ్ల అనుభవం ఉన్న విరాట్ కోహ్లీకి రెండు నెలల్లో 38 ఏళ్లు నిండనున్నాయి. 2027 వరల్డ్ కప్ సమయానికి ఇద్దరూ దాదాపు 40 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. కానీ ఈ మెగా టోర్నీలో ఆడే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హిట్‌మ్యాన్‌కు సవాళ్లు.. కోహ్లీకి ప్లస్ పాయింట్: 

ఫామ్, ఫిట్‌నెస్ విషయాల్లో చూస్తే విరాట్ కోహ్లీ పూర్తిస్థాయిలో ఆధిక్యంలో ఉన్నాడు. రోహిత్ శర్మ బరువు తగ్గినప్పటికీ, తరచూ గాయపడటం, బ్యాటింగ్ లో నిలకడగా లేకపోవడం అతనికి పెద్ద సవాలుగా మారింది. 40 ఏళ్ల వయసులో 50 ఓవర్ల పాటు మైదానంలో ఉంటూ పరుగులు సాధించడం రోహిత్‌కు అంత ఈజీ కాదు.. మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌తో నేటి యువ ఆటగాళ్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. రోజురోజుకూ తన ఆటను మెరుగుపరుచుకుంటూ నిలకడగా రాణిస్తుండటంతో, రోహిత్‌తో పోలిస్తే కోహ్లీకి వరల్డ్ కప్ బెర్త్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

వరల్డ్ కప్ బెర్త్ ఎవరికి దక్కుతుంది: 

భారత క్రికెట్ అభిమానులు మాత్రం రోహిత్, కోహ్లీ ఇద్దరినీ 2027 వరల్డ్ కప్‌లో చూడాలని గట్టిగానే కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా వేదికగా జరగబోయే ఈ టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పటి నుంచే పక్కా ప్లాన్‌తో జట్టును లాక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇద్దరికీ అవకాశం దక్కవచ్చు, లేదా ఒక్కరికే ఛాన్స్ రావచ్చు, లేదంటే ఇద్దరినీ పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 

డ్రీమ్ ఫేర్‌వెల్ దక్కేనా?: 

2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే ఈ ఇద్దరి డ్రీమ్ ఫేర్‌వెల్. 2011లోనే వరల్డ్ కప్ నెగ్గిన కోహ్లీకి మరోసారి ట్రోఫీని ముద్దాడాలని ఉంటే.. 2023 ఫైనల్ ఓటమితో మిగిలిన లోటును భర్తీ చేసుకోవాలనే కసితో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. మరి ఈ ఇద్దరు లెజెండ్స్ అనుకున్నట్లుగా 2027 ప్రపంచ కప్ ఆడి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. 
 

©️ VIL Media Pvt Ltd.