Reading Time: < 1 minute
Ap Municipal Law Amendment Gets Governor Approval Key Changes

AP Municipal Law Amendment: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఏపీ మున్సిపల్ లా సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. ఈ సవరణలతో స్థానిక సంస్థల పాలనలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. సవరించిన చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవుల సంఖ్యను రెండింటి నుంచి ఒకటికి తగ్గించారు. అలాగే మున్సిపాలిటీల్లో ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులను కూడా రెండింటి నుంచి ఒకటికి కుదిస్తూ చేసిన సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం పొందిన సవరణ చట్టాన్ని అధికారిక గెజిట్‌లో ప్రచురించేలా న్యాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. గెజిట్‌లో ప్రచురణ అనంతరం ఈ సవరణలకు అధికారికంగా చట్టబద్ధత లభించనుంది.

కొత్త జిల్లాలతో 28 జెడ్పీల ఏర్పాటు
మరోవైపు రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌ల సంఖ్యకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌లకు అదనంగా కొత్త జిల్లాలను చేర్చి మొత్తం 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేసే దిశగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా మొత్తం 28 జెడ్పీల ఏర్పాటు కోసం చేసిన పంచాయతీరాజ్ సవరణ చట్టానికి కూడా గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. మున్సిపల్ సంస్థల్లో పదవుల సంఖ్యను కుదించడం, కొత్త జిల్లాల నేపథ్యంలో జెడ్పీలను పునర్వ్యవస్థీకరించడం వంటి కీలక మార్పులకు గవర్నర్ ఆమోదం లభించడంతో రాష్ట్ర స్థానిక సంస్థల వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.