Reading Time: 2 minutes
IND vs NZ: లంక ఎఫెక్ట్.. కీవిస్‌తో సిరీస్ నుంచి ఐదుగురు ఔట్.. ఇకపై ఎంట్రీ కష్టమే..?

India vs New Zealand Test Series: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను 1-0తో గెలుచుకున్న టీమిండియా, ఇప్పుడు రాబోయే న్యూజిలాండ్ పర్యటనపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 19న వెల్లింగ్టన్‌లో తొలి టెస్ట్, అలాగే నవంబర్ 27న క్రైస్ట్ చర్చ్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ పరిస్థితులు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ) భారత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక సిరీస్‌లో ఆడిన కొందరు ఆటగాళ్లకు న్యూజిలాండ్ పర్యటనలో చోటు దక్కకపోవచ్చని చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఓ ఐదుగురు ఆటగాళ్లపై సెలెక్టర్లు పునరాలోచించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1. యశస్వి జైస్వాల్: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో జైస్వాల్ కేవలం 139 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 34.75 సగటు మాత్రమే ఉంది. దూకుడైన బ్యాటింగ్ జైస్వాల్ బలం. అయితే అదే శైలి కొన్ని సందర్భాల్లో అతడికి ప్రతికూలంగా మారుతుంది. గాలే టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో ఆరంభంలోనే దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్‌ను చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్‌లో బంతి స్వింగ్ అయ్యే పరిస్థితులు ఉండటంతో ఫుట్‌వర్క్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పులు జరగాలని మేనేజ్‌మెంట్ భావిస్తే, జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. అప్పుడు కె.ఎల్. రాహుల్‌తో సుదర్శన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నారు. ఇక దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభమన్ గిల్ ఆ తర్వాతి స్థానాలకి ఎటువంటి ఢోకా లేదు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

2. కుల్దీప్ యాదవ్: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి ఒకే వికెట్ మాత్రమే తీశాడు. దీంతో అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. అంతేకాదు, న్యూజిలాండ్‌లో పరిస్థితులు స్పిన్నర్ల కంటే పేసర్లకి ఎక్కువగా అనుకూలించే విధంగా ఉండటంతో ఎక్కువ మంది స్పిన్నర్లతో వెళ్లాల్సిన అవసరం ఉండదు. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడటం, అలాగే మానవ సుతార్ కూడా జట్టులో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కుల్దీప్ ఎంపిక కష్టమే.

3. సర్ఫరాజ్ ఖాన్: సాయి సుదర్శన్ స్థానంలో శ్రీలంక టూర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కొలంబో టెస్ట్‌లో రిషభ్ పంత్ గాయపడిన సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సేవలు అందించాడు. అయితే సాయి సుదర్శన్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే, సర్ఫరాజ్‌కు జట్టులో చోటు కష్టమే.

4. గుర్‌నూర్ బ్రార్: యువ పేసర్ గుర్‌నూర్ బ్రార్ కూడా న్యూజిలాండ్ టూర్‌లో చోటు విషయంలో పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉంటే అతన్ని ఎంపిక చేయడం కష్టమే. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ విభాగంలో బలమైన పోటీదారులుగా ఉన్నారు. అంతేకాదు, హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకుంటే అతడు కూడా పోటీలోకి వస్తాడు. దీంతో గుర్‌నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు దక్కేది అనుమానమే.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

5. సారంష్ జైన్: శ్రీలంకతో రెండో టెస్ట్‌లో 33 ఏళ్ల వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన సారంచ్ జైన్ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్ సిరీస్‌కు అతడికి చోటు దక్కడం అనుమానమే.

మొత్తంగా న్యూజిలాండ్ టూర్‌కు ఈ ఐదుగురు ప్లేయర్‌లు ఎంపిక అవ్వడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రాగా ముగియడంతో భారత్ 1-0తో సిరీస్‌ని గెలుచుకుంది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల పరంగా అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ గడ్డపై అత్యుత్తమ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని టీమిండియా భావించడం ఖాయం. దీంతో శ్రీలంక సిరీస్‌లో కనిపించిన కొందరు ఆటగాళ్లకు చోటు దక్కకపోవచ్చు. అయితే తుది జట్టుపై నిర్ణయం ఆటగాళ్ల ఫిట్‌నెస్, దేశవాళి ప్రదర్శనలో, న్యూజిలాండ్ పిచ్‌ల పరిస్థితులను బట్టి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..