Reading Time: < 1 minute
Mirza Rahmath Baig Expelled From Mim Over Video Leak Issue

AIMIM: ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కీలక నిర్ణయం తీసుకుంది. మిర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ వెల్లడించారు. పార్టీ నుంచి బహిష్కరణతో పాటు మిర్జా రహమత్ బేగ్ తన పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని ఎంఐఎం ఆదేశించింది. రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని స్పష్టం చేసింది.

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో లీక్ వ్యవహారమే ఈ చర్యకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వీడియో లీక్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే మిర్జా రహమత్ బేగ్‌పై పార్టీ చర్యకు దారితీసిన ఇతర కారణాలను ఎంఐఎం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మిర్జా రహమత్ బేగ్‌పై పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మిర్జా రహమత్ బేగ్‌.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా అనే చర్చ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.. ఇటీవలే ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.. ఈ లోగా.. మిర్జా రహమత్ బేగ్‌పై చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.. పార్టీ ఆదేశాల ప్రకారం మిర్జా రహమత్ బేగ్‌ ఎమ్మెల్సీ పదవికి కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చింది..