
ఓస్లో, ఆగస్ట్ 28: హరాల్డ్ V 1991లో నార్వే రాజుగా బాధ్యతలు చేపట్టారు. మూడు దశాబ్దాలకు పైగా దేశానికి సేవలందించిన ఆయన.. నార్వే ప్రజల్లో ఐక్యతకు ప్రతీకగా, సరళమైన వ్యక్తిత్వం కలిగిన రాజుగా గుర్తింపు పొందారు. రాజకుటుంబాన్ని ఆధునీకరించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 1937లో జన్మించిన హరాల్డ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి నార్వేను విడిచి అమెరికాలో కొంతకాలం గడిపారు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. యువరాజుగా ఉన్న సమయంలో పడవల పోటీల్లో పాల్గొని ఒలింపిక్స్‌లో నార్వేకు ప్రాతినిధ్యం వహించారు. హరాల్డ్ కొంతకాలంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయనను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. హీమోలిటిక్ అనీమియా సహా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన చికిత్స పొందినట్లు సమాచారం. గతంలో బ్లాడర్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనకు 2024లో పేస్‌మేకర్‌ను అమర్చారు. అయినప్పటికీ రాజ పదవికి రాజీనామా చేయడాన్ని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు.
రాజు మరణంతో నార్వేలో జాతీయ సంతాప వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా జెండాలను సగానికి అవనతం చేశారు. ప్రజలు ఓస్లోలోని రాజభవనం వద్దకు చేరుకుని తమ ప్రియతమ రాజుకు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం చర్చిల గంటలు మోగించడంతో పాటు సాయుధ దళాల ఆధ్వర్యంలో గౌరవ సూచక కార్యక్రమాలు నిర్వహించారు. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ హరాల్డ్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక దేశం మొత్తం విషాదంలో ఉంది. నార్వే ప్రజలు ఆయన దీర్ఘకాల సేవలకు కృతజ్ఞతతో ఉన్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. హరాల్డ్ మరణంపై యూరప్‌లోని పలు రాజకుటుంబాలు సంతాపం ప్రకటించాయి. బ్రిటన్ రాజు చార్లెస్ III ఆయనను తన ప్రియమైన బంధువుగా నివాళులు అర్పించారు. స్వీడన్, డెన్మార్క్, స్పెయిన్, బెల్జియం తదితర దేశాల రాజకుటుంబాలు కూడా హరాల్డ్ సేవలను గుర్తుచేసుకున్నాయి.
కొత్త రాజు హాకోన్ VIII
తండ్రి మరణంతో 53 ఏళ్ల హాకోన్ VIII నార్వే సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆయన ఇప్పటికే తండ్రి అనారోగ్య సమయంలో రీజెంట్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. రాజుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వంతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్‌లో త్వరలోనే రాజుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నార్వేలో రాజుల పట్టాభిషేక కార్యక్రమాలను ఒక శతాబ్దానికి పైగా క్రితమే రద్దు చేశారు. అయితే హాకోన్ తన పాలనకు ఆశీర్వాదం లభించేలా ప్రత్యేక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం ఉంది. హరాల్డ్ మరణం నార్వే రాజకుటుంబానికి ఒక శకానికి ముగింపు పలికింది. అదే సమయంలో హాకోన్ VIII బాధ్యతలు చేపట్టడంతో నార్వే రాజరికంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.