
2027 World Cup: మైదానంలో బంతిని సిక్సర్ల రూపంలో స్టేడియం దాటించే కిల్లర్ మిల్లర్ తన మనసులో ఇప్పుడు ఒకే ఒక్క డ్రీమ్ మిగిలి ఉంది. దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా జట్టును వెంటాడుతున్న చోకర్స్ అనే ముద్రను చెరిపేసి, సరికొత్త చరిత్ర సృష్టించడమే తన ప్రధాన ధ్యేయమని ప్రకటించాడు. తన కెరీర్ చివరి ఘట్టంలో ప్రొటీస్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందించి, ఆ విజయోత్సవంతోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే బిగ్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నాడు.
డ్రీమ్ టార్గెట్ 2027:
2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల ఉమ్మడి ఆతిథ్యంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. గత 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమిని సఫారీ అభిమానులు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. దీంతో సొంత ప్రేక్షకుల మధ్య జరిగే ఈ మెగా టోర్నీ తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైనదని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు. అప్పటి వరకు జట్టులో తన స్థానాన్ని కాపాడుకుంటూ, దేశానికి తొలి వన్డే వరల్డ్ కప్ అందించడానికి శాయశక్తులా పోరాడతానని ధీమా వ్యక్తం చేశాడు.
దశాబ్ద కాలపు సుదీర్ఘ అనుభవం:
క్రికెట్‌లో అత్యంత క్లిష్టమైన ఫినిషర్ పాత్రను పోషించడంలో మిల్లర్ సిద్ధహస్తుడు. మ్యాచ్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఒత్తిడిని అధిగమించి సిక్సర్లతో మ్యాచ్‌లను ముగించడం తన స్పెషల్, ఇటీవల ముగిసిన ది హండ్రెడ్ 2026లో సదరన్ బ్రేవ్ తరఫున 166 రన్స్ చేసి మంచి ఫామ్‌ను కనబరిచిన మిల్లర్, అదే ఊపును కొనసాగిస్తూ 2027 ప్రపంచకప్ నాటికి ఫుల్ ఫిట్‌నెస్‌తో రెడీగా ఉండాలని చూస్తున్నాడు.
కిరాక్ ఇన్నింగ్స్‌లతో గ్రాండ్ ఫినిషింగ్:
తన సుదీర్ఘ కెరీర్‌లో 2022లో గుజరాత్ టైటాన్స్‌తో సాధించిన ఐపీఎల్ టైటిల్ విజయం, ఆర్‌సీబీపై కొట్టిన 101 నాటౌట్, ఆస్ట్రేలియాపై సాధించిన 118 నాటౌట్ ఇన్నింగ్స్‌లను అత్యుత్తమ జ్ఞాపకాలుగా డేవిడ్ మిల్లర్ గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు ఆ అనుభవాన్నంతా ఉపయోగించి దక్షిణాఫ్రికాకు తొలి వన్డే ప్రపంచకప్ అందించి, తన లాస్ట్ డాన్స్ ను ఐకానిక్‌గా మార్చాలని కసితో ఉన్నాడు. మరి మిల్లర్ డ్రీమ్ నెరవేరుతుందో లేదో వేచి అంటే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు వేచి చూడాల్సిందే.