Reading Time: < 1 minute
Nepal Glacial Lake Overflow Flood Alert China Border

Nepal Floods:  గురువారం సంభవించిన మెరుపు వరదలు నేపాల్‌ను తీవ్రంగా కష్టాల్లోకి నెట్టింది. వరదలు ఆ దేశంలో విధ్వంసాన్ని సృష్టించాయి. భోటేకోశి నది ఉప్పొంగడంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికే నేపాల్ మృతుల సంఖ్య 400లను దాటింది. ఇదిలా ఉంటే, నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల సమీపంలోని గారింగ్ సరిహద్దు ప్రాంతం ఎగువన హిమానీనదం కూలిపోవడంతో ఏర్పడిన సహజ సరస్సు ఇప్పుడు పొంగిపొర్లుతోంది. సరస్సు నుంచి నీరు గట్టను దాటి బయటకు వస్తున్నట్లు చైనీస్ మీడియా సీసీటీవీ శుక్రవారం వెల్లడించింది.

సరస్సు నుంచి భారీగా నీరు బయటకు వస్తుండటంతో దిగువ ప్రాంతాల్లోని నదుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే వరద విధ్వంసంతో చిగురుటాకులా వణికిన నేపాల్ మరో ముప్పును ఎదుర్కోబోతోంది. నదీ పరివాహక ప్రాంతాలకు భారీ వరద ముప్పు ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న శుక్రవారం మధ్యాహ్నం 2.30 తర్వాత 1.5-2 గంటలు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు అక్కడి అధికారులు హెచ్చరించారు.

సరస్సు నుంచి నీరు గట్లను దాటి కిందకు వస్తుందన్న సమాచారం రావడంతో నేపాలీ సైన్యం, సహాయక బృందాలు తమ రెస్క్యూ కార్యక్రమాలనున తాత్కాలికంగా నిలిపేశారు. 90 నిమిషాల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.

చైనా సర్వే ప్రకారం, ప్రస్తుతం సరస్సులో 25 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా నీరు నిల్వ ఉంది. ఒక్కరోజు ముందు ఈ పరిమాణం సుమారు 15–20 లక్షల క్యూబిక్ మీటర్లుగా అంచనా వేశారు. దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎంత వేగంగా మారుతోందో తెలుస్తోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా గతంలో అంచనా వేసింది. ఇది దాదాపు 1,200 ఒలింపిక్‌-సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌కు సమానం. సరస్సు ఆనకట్ట తెగితే దిగువ ప్రాంతాలకు ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం ముంచెత్తే అవకాశం ఉంది.