Reading Time: 2 minutes
Rakhi Special 7 Best Brother Sister Movies To Watch On Ott

Rakhi Special: రక్షా బంధన్ (రాఖీ పండుగ) అనేది తోడబుట్టిన పవిత్రమైన అనుబంధాన్ని వేడుకగా జరుపుకునే ఒక గొప్ప భారతీయ సాంప్రదాయ పండుగ. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు ప్రేమతో రక్షా సూత్రాన్ని (రాఖీ) కట్టి, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తూ హారతి ఇవ్వగా, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాట ఇస్తూ వారికి ప్రత్యేకమైన బహుమతులను కానుకగా అందిస్తారు. కుటుంబసభ్యులంతా ఒకచోట చేరి మిఠాయిలు పంచుకుంటూ, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ రక్తసంబంధాల మధ్య ప్రేమాభిమానాలను మరింత బలోపేతం చేస్తుంది.

రక్తసంబంధాల తీపిని, తోడబుట్టినవారి అండను వేడుకగా జరుపుకునే ఈ పండుగ కేవలం నిజజీవితానికే పరిమితం కాలేదు. వెండితెరపై కూడా ఎన్నో అద్భుతమైన కథలుగా రూపాంతరం చెందింది. ఈ పండుగ రోజు థియేటర్ల దాకా వెళ్లే పనిలేకుండా, హ్యాపీగా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూడదగ్గ ఏడు సూపర్ హిట్ అన్నచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల సినిమాల లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. వీటిని చూస్తూ ఫ్యామిలితో మరింత కనులపండుగగా ఈ పండుగ రోజును సెలెబ్రేట్ చేసుకోవచ్చు.

1. రాఖీ (Rakhi)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్‌కి పీక్స్ లాంటి సినిమా ఇది. తన ప్రాణమైన చెల్లెలికి అత్తగారింట్లో అన్యాయం జరిగితే, సమాజంలో ఆడపిల్లల మీద దారుణాలు చేసేవాళ్లని నరుక్కుంటూ వెళ్లే ఒక పవర్‌ఫుల్ అన్నయ్య కథ ఇది. కృష్ణవంశీ మార్క్ ఎమోషన్స్, ఎన్టీఆర్ యాక్టింగ్ థియేటర్లలో అప్పట్లో పూనకాలు తెప్పించాయి. సన్ నెక్ట్స్ (Sun NXT) / జీ5 (ZEE5) ఓటీటీలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

2. అన్నవరం (Annavaram)

పవన్ కళ్యాణ్, సంధ్య అన్నచెల్లెళ్లుగా నటించిన పక్కా మాస్ ఎమోషనల్ హిట్ మూవీ ఇది. తన చెల్లెలి కాపురం ప్రశాంతంగా ఉండటం కోసం, హైదరాబాద్ సిటీలోని రౌడీలని ఏరిపారేసే ఒక పల్లెటూరి అన్నయ్య స్టోరీ ఇది. ఇందులో సాంగ్స్, సెంటిమెంట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

3. పెద్దన్న (Annaatthe)

సూపర్ స్టార్ రజనీకాంత్, కీర్తి సురేష్ అన్నచెల్లెళ్లుగా నటించిన పక్కా పల్లెటూరి ఫ్యామిలీ డ్రామా ఇది. సిటీకి వెళ్లి కష్టాల్లో పడిన తన చెల్లెలికి తెలియకుండానే, వెనక ఉండి నీడలా కాపాడే ఒక అన్నయ్య కథ. రజనీకాంత్ స్టైల్ యాక్షన్, సెంటిమెంట్ పండుగ పూట ఫ్యామిలీతో చూడటానికి పక్కాగా సెట్ అవుతాయి. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

4. బ్రూస్ లీ: ది ఫైటర్ (Bruce Lee)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కృతి కర్బంద అక్కాతమ్ముళ్లుగా నటించిన మోడ్రన్ కమర్షియల్ సినిమా. తన అక్క ఐఏఎస్ చదువు కోసం, ఇంట్లో ఇబ్బందులు రాకుండా ఉండటానికి తమ్ముడు తన చదువు ఆపేసి స్టంట్ మేన్‌గా మారతాడు. అక్క కల కోసం తమ్ముడు చేసే ఫైట్స్, మధ్యలో వచ్చే కామెడీ ఈ సినిమాలో భలే ఉంటాయి. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

5. అర్జున్ (Arjun)

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి రెడ్డి ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్‌గా నటించిన క్లాసిక్ యాక్షన్ మూవీ. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిన తన సోదరి ప్రాణాలకి ముప్పు ఉందని తెలిసి, ఆమెను కాపాడటానికి ఒంటరిగా మధురై వెళ్లి అక్కడి విలన్లని ఎదిరించే ధైర్యవంతుడైన అన్నయ్య కథ ఇది. గుణశేఖర్ వేసిన భారీ మధురై మీనాక్షి టెంపుల్ సెట్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ మూవీ స్ట్రీమింగ్ లో ఉంది.

6. గోరింటాకు (Gorintaku)

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్యూర్ సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. అత్తగారింట్లో కష్టాలు పడుతున్న చెల్లెలి కోసం అన్నయ్య పడే తపనను, వాళ్ల మధ్య ఉండే అమాయకమైన పల్లెటూరి ప్రేమానుబంధాన్ని ఈ సినిమా కన్నీళ్లు పెట్టించేలా చూపిస్తుంది. ఓల్డ్ స్కూల్ సెంటిమెంట్ ఇష్టపడేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. సన్ నెక్ట్స్ (Sun NXT)లో ఈ సినిమాను చూసేయచ్చు.

7. దిల్ ధడక్నే దో (Dil Dhadakne Do)

మోడ్రన్ బ్యాక్‌డ్రాప్‌లో అక్కాతమ్ముళ్ల అల్లరి, బాండింగ్‌ని సరదాగా చూడాలనుకుంటే రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా నటించిన ఈ బాలీవుడ్ సినిమాన సూపర్ ఛాయిస్. ఒక లగ్జరీ షిప్ జర్నీలో సాగే ఈ కథలో, పేరెంట్స్ పెట్టే ప్రెజర్ తట్టుకుంటూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలిచే ఈ కాలపు అక్కాతమ్ముళ్ల రిలేషన్‌ని భలే చూపిస్తారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది.