Reading Time: 2 minutes
Asif Khan Banned For 15 Months By Icc Over Doping Violation

ICC: డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిపోవడంతో ఓ స్టార్‌ క్రికెటర్‌పై వేటు వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. దీంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) స్టార్ బ్యాటర్ ఆసిఫ్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై 15 నెలల నిషేధం విధించింది. 36 ఏళ్ల ఆసిఫ్ ఖాన్ నమూనాలో నిషేధిత పదార్థమైన మెస్టెరోలోన్ మెటబొలైట్ ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయింది.

డోపింగ్ టెస్ట్‌లో నిషేధిత పదార్థం

2025 సెప్టెంబర్ 8న పోటీయేతర డోపింగ్ పరీక్షలో భాగంగా ఆసిఫ్ ఖాన్ నుంచి నమూనా సేకరించారు. పరీక్షల్లో నిషేధిత పదార్థం ఉన్నట్లు తేలడంతో అతనిపై చర్యలు ప్రారంభమయ్యాయి. తాను ఐసీసీ డోపింగ్ నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు ఆసిఫ్ అంగీకరించాడు. వాడా, ఐసీసీ మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా విధించిన శిక్షను కూడా అతను అంగీకరించాడు. ఆసిఫ్ ఖాన్ సస్పెన్షన్ 2025 సెప్టెంబర్ 8 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ నిషేధం 2026 డిసెంబర్ 7 వరకు కొనసాగనుంది. దీంతో డిసెంబర్ 8, 2026 నుంచి మాత్రమే అతను పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.

అక్టోబర్ నుంచి శిక్షణకు అనుమతి

నిషేధం కొనసాగుతున్నప్పటికీ ఆసిఫ్ ఖాన్‌కు అక్టోబర్ 8, 2026 నుంచి శిక్షణ తీసుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. జట్టుతో కలిసి శిక్షణ పొందడంతో పాటు క్లబ్ లేదా ఐసీసీ సభ్య సంస్థకు చెందిన శిక్షణ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అయితే శిక్షణకు అనుమతి లభించినంత మాత్రాన అధికారిక మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఉండదు. పోటీ క్రికెట్‌లోకి అతని పునరాగమనం డిసెంబర్ 8 నుంచే సాధ్యమవుతుంది. అయితే, ఆసిఫ్ ఖాన్‌కు విధించిన శిక్ష ప్రభావం భవిష్యత్ మ్యాచ్‌లకే పరిమితం కాదు. ఐసీసీ డోపింగ్ నిరోధక నియమావళి ప్రకారం 2025 సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 29 మధ్య అతను సాధించిన వ్యక్తిగత ఫలితాలను కూడా అనర్హంగా ప్రకటించారు. ఈ కాలంలో అతను సాధించిన పతకాలు, పాయింట్లు, ప్రైజ్ మనీ, ఇతర వ్యక్తిగత అవార్డులను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 2025 డిసెంబర్ 29న ఆసిఫ్ ఖాన్‌పై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. తాజాగా 15 నెలల నిషేధం ఖరారు కావడంతో అతని క్రికెట్ కెరీర్‌కు కొంతకాలం బ్రేక్ పడింది.

ఆసిఫ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్
ఆసిఫ్ ఖాన్ 2022లో యూఏఈ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి వన్డేలు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు యూఏఈ తరఫున 94 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 38 వన్డేలు, 56 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. వన్డేల్లో ఆసిఫ్ ఖాన్ 38.48 సగటుతో 1,248 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 28.30 సగటుతో 1,302 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతని ఖాతాలో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అనుభవజ్ఞుడైన యూఏఈ బ్యాటర్‌పై డోపింగ్ నిషేధం విధించడంతో అతని జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అక్టోబర్ నుంచి శిక్షణకు తిరిగి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అధికారిక పోటీ క్రికెట్ ఆడేందుకు మాత్రం డిసెంబర్ 8, 2026 వరకు వేచి చూడాల్సిందే.