KPHB ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్ ఎదుట గొడవ : డబ్బులు కట్టినా బంగారం ఇవ్వటం లేదని ఆందోళన

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 9వ ఫేజ్ లో ఉన్న ముత్తూట్ ఫిన్ కార్ప్ గోల్డ్ లోన్ ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. బంగారం పెట్టి డబ్బులు తీసుకున్నాం అని.. ఇప్పుడు డబ్బులు కట్టి బంగారం ఇవ్వమంటే ఇవ్వటం లేదంటూ 60 మంది వరకు కస్టమర్లు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు కస్టమర్లు.
ఈ ముత్తూట్ ఫిన్ కార్ప్ బ్రాంచ్ లో మేనేజర్ గా పని చేస్తున్న ప్రియాంక రెడ్డి.. కస్టమర్లు కుదవ పెట్టిన బంగారాన్ని మాయం చేసినట్లు చెబుతున్నారు బాధితులు. కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టిన తర్వాత.. అందులో కొంత బంగారాన్ని కొట్టేసినట్లు ఆరోపిస్తున్నారు. తీసుకున్న డబ్బులు కట్టేశాం అని.. మా బంగారం మాకు ఇవ్వండి అంటే.. ఆడిటింగ్ జరుగుతుంది అంటూ వారం రోజులుగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ కస్టమర్ 750 గ్రాముల బంగారం తాకట్టు పెట్టగా.. ఇప్పుడు డబ్బులు కట్టి బంగారం తీసుకోవటానికి వస్తే.. అందులో 160 గ్రాములు తగ్గిందని చెబుతున్నారు. తగ్గిన 160 గ్రాముల బంగారం తిరిగి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు ఆ కస్టమర్. బ్రాంచ్ మేనేజర్ గా పని చేసిన ప్రియాంక రెడ్డినే.. కస్టమర్ల బంగారం కొట్టేసినట్లు సిబ్బంది చెబుతున్నా.. ఇంత వరకు ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నిస్తున్నారు కస్టమర్లు.
ALSO READ : భవిష్యత్ అంతా హైడ్రోజన్దే..
ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీని నమ్మి మా బంగారం తాకట్టు పెట్టామని.. ముత్తూట్ ఫైనాన్స్ బాధ్యత వహించి.. మా బంగారం మాకు ఇవ్వాలంటూ ఫైనాన్స్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు కస్టమర్లు. ఇప్పటి వరకు 60 మంది కస్టమర్లు తమ బంగారం మాయం అయినట్లు కంప్లయింట్ చేశారు.
మిగతా కస్టమర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని వచ్చి చూసుకుంటున్నారు. కొంత మంది కస్టమర్లు డబ్బులు కట్టేసి.. వాళ్ల వాళ్ల బంగారం తీసుకెళ్లటానికి ఫైనాన్స్ కంపెనీకి రావటంతో.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినా వారం రోజులుగా పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.