EPFO వేతన పరిమితి పెంపునకు బ్రేక్.. ప్రస్తుతం రూ.15 వేలే కొనసాగింపు

ఉద్యోగులకు EPFO ప్రయోజనాలను మరింత మందికి అందించేందుకు వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా పడింది. కంపెనీలపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నెలకు రూ.15 వేల వరకు బేసిక్ శాలరీ తీసుకునే ఉద్యోగులకు EPF, EPS పథకాల్లో చేరడం తప్పనిసరి. అంతకంటే ఎక్కువ బేసిక్ జీతం ఉంటే EPFOలో చేరడం ఉద్యోగి ఇష్టంపైనే ఉంటుంది. యజమాని కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు ఉద్యోగి, యజమాని ఇద్దరూ బేసిక్ జీతంలో 12 శాతం చొప్పున EPFOకి చెల్లిస్తున్నారు. రూ.15 వేల వేతన పరిమితి ప్రకారం ఒక్కొక్కరు గరిష్టంగా నెలకు రూ.1,800 చెల్లించాలి. ఒకవేళ శాలరీ పరిమితిని రూ.25 వేలకు పెంచితే ఈ మొత్తం రూ.3వేలకు చేరుతుంది. దీంతో కంపెనీల ఖర్చు కూడా పెరుగుతాయి. ఇప్పటికే కొత్త కార్మిక చట్టాల వల్ల చాలా కంపెనీల ఖర్చులు పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమయంలో మరో అదనపు భారం వేయకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వేతన పరిమితి పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది.
ALSO READ : CBSE టెన్త్ సర్టిఫికెట్ కావాలంటే..
అయితే ఈ ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయలేదు. కార్మిక సంఘాలు, యాజమాన్యాలతో చర్చించిన తర్వాత సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచితే మరో కోటి మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరిగా EPFO పరిధిలోకి వస్తారని అంచనా. ప్రస్తుతం EPFOలో సుమారు 8 కోట్ల మంది సభ్యులు ఉండగా.. సంస్థ వద్ద రూ.27–28 లక్షల కోట్ల వరకూ నిధులు ఉన్నాయి.