వరంగల్ లో ఇవాళ్టి(జులై 15)నుంచి..భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు

వరంగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు నుంచి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.ఆషాఢ మాసంలో జరిగే ఈ శాకంభరి ఉత్సవాలకు ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన చరిత్ర ఉంది!
సుమారు 450 నుంచి 500 ఏళ్ల క్రితం దేశమంతా తీవ్రమైన కరవు వచ్చిందట. వర్షాలు లేక, పంటలు పండక, భూములన్నీ బీడువారిపోయి ప్రజలు అల్లాడిపోయారు. ఆ సమయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ శాకాంబరి ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఆషాఢంలో ఈ వేడుకలను జరపడం ఆనవాయితీగా వస్తోంది.
ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఇక మొదటి రోజైన ఈరోజు… ఉదయం కాళీ క్రమంలో, సాయంత్రం కామేశ్వరీ క్రమంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ ఉత్సవాలన్నింటిలోకెల్లా చివరి రోజున జరిగే అలంకరణ అత్యంత ప్రత్యేకమైనది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని పూర్తిగా రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో అద్భుతంగా అలంకరిస్తారు. శాకములతో అలరించే ఆ తల్లి రూపం నయనానందకరంగా ఉంటుంది.
ఈ మహోత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.