July 17, 2026

IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..

IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
Reading Time: < 1 minute
India Vs England Second Odi Cardiff Match Report India All Out 233 Runs

కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 65 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66 పరుగులు) అర్ధశతకాలతో రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 31 పరుగులు, రోహిత్ శర్మ 26 పరుగులు చేసి నిరాశపరిచారు. వికెట్ కీపర్ ఈషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1), శివమ్ దూబే (0) వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది.

అయితే ఆఖరిలో జస్ప్రీత్ బుమ్రా సంచలన బ్యాటింగ్‌తో మెరిశాడు. సాకిబ్ వేసిన ఒకే ఓవర్లో బుమ్రా మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 18 పరుగులు పిండుకోవడంతో భారత్ స్కోరు 230 దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, గస్ అట్కిన్సన్ కూడా 3 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశాడు. సాకిబ్ కు 2 వికెట్లు దక్కాయి.

అంతకుముందు జరిగిన టాస్‌లో ఇంగ్లండ్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగాయి. భారత జట్టులో కెఎల్ రాహుల్ స్థానంలో ఈషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో అంతకుముందు జరిగిన టి20 సిరీస్‌ను 0-4తో పూర్తిగా కోల్పోయిన టీమిండియా, వన్డే సిరీస్‌ను మాత్రం గెలుపుతో ప్రారంభించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో వన్డేలో సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత్‌ను ఇంగ్లండ్ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు. ఇప్పుడు మ్యాచ్ గెలవాలంటే భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను 233 పరుగుల లోపే నిలువరించాల్సి ఉంటుంది.