ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య

పల్నాడు, జులై 14: కుటుంబ కలహాల నేపథ్యంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలను తన చేతులతోనే హత్యచేసి, ఆ తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన నక్కా భారతి (24) అనే మహిళకు సునీల్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తేజేష్‌రెడ్డి (6), హేమనాథ నాగి రెడ్డి (4) ఇద్దరు కుమారులు ఉన్నారు. తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త సునీల్‌రెడ్డి పాల వ్యాను డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు రాసాగాయి.
ఈ నేపథ్యంలో భర్త బయటకు వెళ్లిన సమయంలో భారతి తన ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో నా చావుకు ఎవరూ కారణం కాదని భారతి రాసినట్లు తెలుస్తోంది. దీంతో భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.