Amaravati Land Price: అమరావతిలో ఎకరం రూ.8.20 కోట్లు.. రాజధాని భూములకు రికార్డు ధర..

అమరావతి రాజధాని భూముల విలువ సరికొత్త రికార్డు సృష్టించింది. స్టార్ హోటళ్ల కోసం ఎకరానికి రూ.8.20 కోట్ల ధరను సీఆర్డీఏ నిర్ణయించింది. అమరావతిలో ఇప్పటి వరకు ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో ఇదే అత్యధిక ధర. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్ల కోసం ఎకరానికి రూ.4.10 కోట్ల ధరతో ఐదు స్టార్ హోటళ్లు, ఐదు ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. అమరావతిలో రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటున్న వేళ సీఆర్డీఏ తీసుకున్న ఈ కీలక నిర్ణయం.. అమరావతి నగరానికి మరో మైలురాయిగా నిలిచిపోనుంది. అయితే, అమరావతిలో ఇప్పటివరకూ కేటాయించిన భూముల్లో ఇదే అత్యధిక రేటు.. స్టార్ హోటళ్లకు 9.19 ఎకరాలు.. ప్రైవేట్ స్కూళ్లకు 15.80 ఎకరాల భూమిని CRDA కేటాయించింది. స్కూల్ నిర్మాణం కోసం 33ఏళ్ల పాటు భూమిని లీజుకు తీసుకోవచ్చు. ఇక.. హోటల్ నిర్మాణానికి కేటాయించిన భూమి.. ఎకరానికి రూ.8.20 కోట్ల ధర నిర్ణయించింది CRDA..
హోటళ్లకు కఠిన నిబంధనలు
రాజధానిలో మూడు త్రీ స్టార్, రెండు ఫోర్ స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్నారు. హోటల్ భూములను ఫ్రీహోల్డ్ పద్ధతిలో కేటాయిస్తారు. హోటల్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.75 కోట్ల పెట్టుబడి తప్పనిసరి. ప్రతి హోటల్‌లో కనీసం 125 గదులు ఉండాలి. ప్రతి గది 5 స్టార్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి హోటల్ భవనంపై హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం తప్పనిసరి. హోటల్ నిర్వహణకు కనీసం 175 మంది సిబ్బంది ఉండాలి. కన్వెన్షన్, బ్యాంకెట్ హాళ్లు ఏర్పాటు చేసి ఏడాదికి కనీసం 2,500 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక ఉండాలని సీఆర్డీఏ షరతు విధించింది.
సీఆర్డీఏకు ప్రత్యేక సౌకర్యాలు
హోటళ్లను నిర్మించే సంస్థలు సీఆర్డీఏకు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించాలి. ప్రతి ఏడాది 15 రోజుల పాటు గదులను సీఆర్డీఏ వినియోగానికి ఉచితంగా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ సమావేశాలు, సదస్సుల కోసం బ్యాంకెట్ హాలును కూడా ఏడాదికి 15 రోజుల పాటు ఉచితంగా ఇవ్వాలి. ఏడాది లోపు బ్యాంకు గ్యారంటీ సమర్పించడంతో పాటు, నిర్ణీత గడువులో నిర్మాణాలు పూర్తి చేయాలి. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, బ్యాంకు గ్యారంటీ జప్తు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని టెండర్లలో స్పష్టం చేసింది.
విద్యా రంగానికీ ప్రాధాన్యం..
రాజధానిలో నాణ్యమైన విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు ఐదు ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటుకు 15.80 ఎకరాల భూమిని కేటాయించింది. ఎల్‌కేజీ నుంచి ప్లస్-2 వరకు విద్య అందించే పాఠశాలలు ఏర్పాటు చేయాలని టెండర్లలో పేర్కొంది. స్కూళ్లకు ఎకరానికి రూ.4.10 కోట్ల ధర నిర్ణయించి, 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూములు కేటాయించనుంది. తుళ్లూరు, నవులూరు, పెనుమాక, కృష్ణాయపాలెం, దొండపాడు ప్రాంతాల్లో ఈ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి.
రాజధాని అభివృద్ధికి మరో అడుగు
రాజధానికి తరలివస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థ సిబ్బంది, దేశీయ-విదేశీ పెట్టుబడిదారులు, కన్సల్టెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ హోటళ్లు, విద్యాసంస్థలకు సీఆర్డీఏ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఈ టెండర్లు మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..