Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?

Team India Coaching Staff Crisis: టీమిండియా కోచింగ్ సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ వన్డే సిరీస్ అనంతరం టెన్ డస్కటే టీమిండియాకు గుడ్ బై చెప్పనున్నాడని, ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐకి చెప్పినట్లు పలు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే టెన్ డస్కటే నిర్ణయం వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మేనేజ్‌మెంట్ ఇచ్చిన ఓ హామీనే ఆయన అసంతృప్తికి ప్రధాన కారణమని పీటీఐ కథనంలో వెల్లడించింది.
ఆచరణకు రాని హామీ:
పీటీఐ నివేదిక ప్రకారం.. ర్యాన్ టెన్ డస్కటే 2024లో భారత జట్టులో అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు. ఆ సమయంలో ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగిస్తామని గౌతమ్ గంభీర్, టీమిండియా మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. అయితే మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందంలో ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన టీ దిలీప్.. గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగాడు. దీంతో టెన్ డస్కటేకు ఇచ్చిన హామీ ఆచరణకు రాలేదు. గత రెండేళ్లుగా ఫీల్డింగ్ కోచ్ బాధ్యతల కోసం ఎదురుచూస్తున్న టెన్ డస్కటేకు.. దిలీప్‌కు మరో ఏడాది పదవీకాలం పొడిగించడం మరింత నిరాశ కలిగించింది.
మరో ఏడాది పొడిగింపు:
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం టీ దిలీప్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్, మసాజర్ అరుణ్ కనడేలను తప్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే భారత జట్టులోని ఓ సీనియర్ ఆటగాడు టీ దిలీప్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయనకు మరో ఏడాది పొడిగింపు దక్కింది. దీంతో టెన్ డస్కటేకు ప్రత్యేక బాధ్యతలు లేకుండా పోయాయి. ప్రస్తుతం బ్యాటింగ్ బాధ్యతలను సితాంశు కోటక్, గౌతమ్ గంభీర్ పర్యవేక్షిస్తుండగా.. ఫాస్ట్ బౌలర్లను మోర్నే మోర్కెల్, స్పిన్నర్లను సాయిరాజ్ బహుతులే చూసుకుంటున్నారు. ఫీల్డింగ్ విభాగం మాత్రం టీ దిలీప్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో టెన్ డస్కటే నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించలేకపోయారు.
ఇద్దరిలో ఒకరు మాత్రమే:
ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో టీ దిలీప్, ర్యాన్ టెన్ డస్కటే ఇద్దరూ కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్ బాధ్యతల విషయంలో ఏర్పడిన ఈ వివాదం కారణంగా ఇద్దరిలో ఒకరు మాత్రమే సపోర్ట్ స్టాఫ్‌లో కొనసాగే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. తాను బాధ్యతల నుంచి తప్పుకుంటాని టెన్ డస్కటే ఇప్పటికే స్పష్టం చేశాడట. మరోవైపు దిలీప్ పనితీరుపై కూడా బీసీసీఐ అసంతృప్తిగానే ఉందట. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ వన్డే సిరీస్ ముగిసేలోగా పూర్తి స్పష్టత రానుంది.