July 17, 2026

ఇండియా ఎకానమీకి  ఎల్నినో కష్టాలు!..విపరీతంగా పెరగనున్న ధరలు

ఇండియా ఎకానమీకి  ఎల్నినో కష్టాలు!..విపరీతంగా పెరగనున్న ధరలు
Reading Time: 2 minutes

ఇండియా ఎకానమీకి  ఎల్నినో కష్టాలు!..విపరీతంగా పెరగనున్న ధరలు

Caption of Image.
  •     తగ్గుతున్న బండ్ల అమ్మకాలు
  •     ఆహార ఉత్పత్తి 4 శాతం డౌన్​
  •     ఎంఎస్​ఎంఈలకు లోన్లు కష్టమే
  •     జేఎం ఫైనాన్షియల్ రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ: ఎల్​నినో మనదేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక పెద్ద వాతావరణ మార్పుతో ఏర్పడే ఈ పరిస్థితితో వర్షాలు రాక అన్ని రంగాలూ దెబ్బతింటాయని జేఎం ఫైనాన్షియల్ సంస్థ స్పష్టం చేసింది.  దీని తాజా రిపోర్ట్ ప్రకారం.. లా నినా కాలంతో పోలిస్తే ఎల్ నినో సంవత్సరాల్లో దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గుతుంది.  ఖరీఫ్ సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు విపరీతంగా పెరుగుతాయి. రిటైల్​ ద్రవ్యోల్బణం, టూవీలర్ల అమ్మకాలు, ట్రాక్టర్ల విక్రయాలు, ఖరీఫ్ నాట్లు, జలాశయాల నీటి నిల్వలు, అగ్రి ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, పరపతి వృద్ధిపై తీవ్ర ప్రభావం ఉంటుంది.  సగటు వర్షపాతంలో మైనస్ 10.65 మేర లోటు నమోదవుతుంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఒకశాతం తగ్గుతుంది. ఆహార ఉత్పత్తి నాలుగు శాతం క్షీణిస్తుంది. లా నినాతో పోలిస్తే ఆహార ద్రవ్యోల్బణం సగటున 60 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. ముఖ్యంగా ట్రాక్టర్ల అమ్మకాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లా నినా సమయంలో ట్రాక్టర్ల విక్రయాలు 10.7 శాతం వృద్ధి చెందగా, ఎల్ నినో కాలంలో కేవలం 3.5 శాతానికే పరిమితమవుతాయి. ఎంఎస్​ఎంఈలకు బ్యాంక్ లోన్లు దొరకడం కష్టమవుతుంది. 

సున్నాకు జీవీఏ వాటా…

భారతదేశ మొత్తం స్థూల అదనపు విలువ (జీవీఏ)లో వ్యవసాయ రంగం వాటా 18 శాతంగా ఉంది. ఎల్ నినో సంవత్సరాల్లో అగ్రి జీవీఏ వృద్ధి దాదాపు ఆగిపోతుంది. లా నినాతో పోలిస్తే ఎల్ నినో కాలంలో సాగు జీవీఏ వృద్ధి రేటు 350 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది. అయితే, ఎల్ నినో సమయంలో టూవీలర్ల అమ్మకాలు 12.1 శాతం పెరిగాయి. కన్జూమర్​, గోల్డ్ లోన్స్ పెరగడంతో బ్యాంక్ రుణాల వృద్ధి రేటు 350 బేసిస్ పాయింట్లు మెరుగవుతుంది. ఎఫ్​ఎంసీజీ కంపెనీల అమ్మకాలు కూడా ఎల్ నినో కాలంలో కొద్దిగా పెరుగుతాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 0.20 డిగ్రీలే పెరిగినప్పటికీ, కరెంటుకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. 2025 నుంచి లోటు తగ్గడం వల్ల ఈ డిమాండ్ ను దేశం తట్టుకోగలుగుతోంది. గతనెల 39.8 శాతం మేర వర్షపాత లోటు ఉంది. సాధారణంగా 165.3 మిల్లీమీటర్ల వర్షానికి గాను 99.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈనెల నైరుతి రుతుపవనాలతో కురిసే వర్షాలు చాలా కీలకం. ఈ లోటును భర్తీ చేయడానికి ప్రస్తుత నెలలో సాధారణ సగటు కంటే 123.5 శాతం ఎక్కువ (దాదాపు 346 మిల్లీలీటర్లు) వర్షం రావాలి.

©️ VIL Media Pvt Ltd.