July 15, 2026

భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య, ఆమె ప్రియుడు!

భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య, ఆమె ప్రియుడు!
Reading Time: 2 minutes
భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య, ఆమె ప్రియుడు!

ఓ భర్త గత 11 నెలలుగా కనిపించకుండా పోయాడు. పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదృశ్యమైనట్లు భావించిన సదరు భర్తను.. అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి అడవిలో పడేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఈ కేసు సంచలనంగా మారింది. బాధితుడు బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా (50) గత ఏడాది ఆగస్టు నుంచి కనిపించకుండా పోయాడు. అయితే 2026 ఏప్రిల్‌లో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అనంతరం పోలీసులు కాల్ డీటెయిల్ రికార్డులు, మొబైల్ నంబర్ల మార్పులు పరిశీలించి నిందితులను విచారించగా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ కేసులో బలిరామ్ భార్య సునీతా కుష్వాహా (40), ఆమె ప్రియుడు రాహుల్ దశరథ్ ప్రజాపతి (30)లను రబాలే ఎంఐడీసీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరచగా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. పోలీసుల కథనం ప్రకారం..

ఐరోలిలోని యాదవ్‌నగర్‌లో నివాసం ఉంటున్న బలిరామ్‌ సూర్యనాథ్‌ కుష్వాహా (50), భార్య సునీత కుష్వాహా (40) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే సునీతా, ఆటో డ్రైవర్‌ అయిన ప్రజాపతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని బలిరామ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో అతడిని హత్య చేయాలని ఇద్దరూ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. 2025 ఆగస్టు 9వ తేదీ రాత్రి ముందుగా బలిరామ్ పిల్లలను వారి మేనత్త ఇంటికి పంపించారు. అనంతరం బలిరామ్ నిద్రపోయిన తర్వాత అతడిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసి, తలను వేరు చేశారు. నేరానికి సంబంధించిన ఆధారాలను తొలగించడానికి మృతదేహ భాగాలను వేర్వేరు సంచులు, బెడ్‌షీట్లలో చుట్టి రాహుల్ ఆటోరిక్షాలో తరలించారు. అనంతరం నవీ ముంబై శివార్లలోని గవ్లీదేవ్ కొండల అడవిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో వాటిని పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హత్య అనంతరం సునీతా తన పిల్లలతో కలిసి ఘన్సోలీ ప్రాంతానికి వెళ్లి రాహుల్‌తో కలిసి నివసించడం ప్రారంభించింది. బలిరామ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని బంధువులు, పొరుగువారిని నమ్మిస్తూ దాదాపు ఏడాది పాటు ఈ నేరాన్ని గోప్యంగా ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇరుగుపొరుగు సునీత అక్రమ సంబంధం బయటపడకుండా భర్తను చంపేసి ఉంటుందని చెబుతున్నారు.
బలిరామ్ సోదరుడు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో నిందితుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలు గుర్తించిన పోలీసులు కాల్ రికార్డులు, మొబైల్ నంబర్ల మార్పులను విశ్లేషించారు. పోలీసులు తమదైన శైలితో విచారణ చేయగా.. నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గవ్లీదేవ్ అడవిలో బలిరామ్ అస్థిపంజరం అవశేషాలు, ఇతర ఆధారాల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.